చెంతకే ‘ఆధార్‌’ సేవలు

23 Oct, 2023 00:46 IST|Sakshi

అనంతపురం అర్బన్‌:

● ఆధార్‌ నవీకరణ (అప్‌డేట్‌) చేసుకోవాలన్నా... కొత్తగా ఆధార్‌ పొందాలన్నా... పెద్ద ప్రయాసతో కూడిన వ్యవహారంగా ఉండేది. ఆధార్‌ అప్‌డేషన్‌ కోసం ప్రజలకు పడిగాపులు తప్పేవి కావు. తెల్లవారుజాము నుంచే బ్యాంకుల వద్ద బారులుదీరిన క్యూ లైన్లు కనిపించేవి. ఈ క్రమంలో గొడవలు, తోపులాటలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించేవారు. ఇదంతా గతం...

నేడు: అలాంటి పరిస్థితులు కనిపించవు. జగన్‌ సర్కార్‌ తీసుకున్న చర్యలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద ప్రజలు పడిగాపులుకాచే పరిస్థితికి చెక్‌ పెట్టింది. కొత్తగా ఆధార్‌ ఎన్‌రోల్మెంట్‌, ఆధార్‌ అప్‌డేట్‌ను సులభతరం చేసింది. సచివాలయాల్లోనే ఆధార్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే క్రమంలో మొబైల్‌ క్యాంపు నిర్వహిస్తూ ఆధార్‌ సేవలను మరింత చేరువ చేసింది.

126 సచివాలయాల్లో సేవలు..

ఆధార్‌ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల్లో ఆధార్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. జిల్లా వ్యాప్తంగా 663 సచివాలయాలకు సంబంధించి 133 ఆధార్‌ కిట్‌లను ప్రభుత్వం ఇచ్చింది. 5ః1 నిష్పత్తిలో ఐదు సచివాలయాలకు ఒక ఆధార్‌ కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ లెక్కన 126 సచివాలయాల్లో ఆధార్‌ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. సచివాలయాల ద్వారా ఇప్పటి వరకు 2,29,390 మంది ఆధార్‌ సేవలు పొందారు.

మొబైల్‌ క్యాంపులు..

ప్రతి నెలా మూడవ లేదా నాల్గవ వారం మొబైల్‌ క్యాంపులు నిర్వహించి ఆధార్‌ సేవలను ప్రజల చెంతకే తీసుకెళుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా మొబైల్‌ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న గుంతకల్లు మునిసిపాలిటీలో క్యాంపు నిర్వహించి 72 మందికి ఆధార్‌ సేవలు అందించారు. ఈ నెల 20, 21 తేదీల్లో అనంతపురంలోని రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాలలో 152 మందికి ఆధార్‌ సేవలు అందించారు.

పడిగాపులకు చెక్‌

సచివాలయాల్లో ఆధార్‌ సేవలు

ప్రతి నెలా 3 లేదా 4వ వారం

మొబైల్‌ క్యాంపు

మరిన్ని వార్తలు