ఎంత చెప్పినా.. అడ్డదిడ్డమే!

23 Oct, 2023 00:46 IST|Sakshi
సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ద్విచక్ర వాహనాన్ని ట్రాఫిక్‌కు అడ్డంగా నడుపుతున్న యువకుడు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో రోడ్డు భద్రతా నిబంధనలను చాలామంది ఉల్లంఘిస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నా వారి డ్రైవింగ్‌ తీరులో ఎటువంటి మార్పూ కనిపించడం లేదు. ఎంతోమంది యువకులు హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు జరిగాయి. ఇలాంటి వాటిపై భారీగా జరిమానాలు వేసినా, అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా ఇప్పటికీ అనేకమంది అడ్డదిడ్డంగానే రోడ్లపై వెళ్తున్నారు. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా తర్వాత ఎక్కువమందికి రోడ్డు నిబంధనల ఉల్లంఘన జరిమానాలు విధించింది అనంతపురం జిల్లాలోనే.

హెల్మెట్‌ లేని కేసులు వేలల్లో...

హెల్మెట్‌ లేని ప్రయాణం ప్రమాదకరమని ఎంత చెప్పినా కొందరు ద్విచక్రవాహనదారులు పట్టించుకోవడం లేదని తేలింది. గడిచిన ఎనిమిది మాసాల్లో 60 వేల మందికి హెల్మెట్‌ లేకుండా వెళ్లినందుకు ఫైన్‌ వేశారు. అయినా ఈ ఏడాది ఆగస్టు వరకు 1.85 లక్షల మందిపై కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి కేసుల సంఖ్య ఏటికేటికీ తగ్గాలి గానీ, పెరుగుతుండటం చూస్తుంటే వాహనదారుల్లో నిర్లక్ష్యం ఎంత ఉందో అంచనా వేయొచ్చు. పోలీసుల ఆధ్వర్యంలో 1.85 లక్షల కేసులు నమోదు చేయగా, రవాణా శాఖ అధికారులు 4వేలకు పైగా కేసులు నమోదు చేశారు.

మొబైల్‌లో మాట్లాడుతూ నడపడం ప్యాషనైంది..

ముఖ్యంగా యువతీ యువకులు మొబైల్‌లో మాట్లాడుతూ వాహనాలు నడపడం ప్యాషన్‌గా మారింది. అత్యంత ప్రమాదకరమని తెలిసినా మాట్లాడుతూనే నడుపుతున్నారు. విశేషమేమంటే జాతీయ రహదారి లాంటి చోట్ల కూడా మొబైల్‌ మాట్లాడుతూనే టూవీలర్‌ నడుపుతున్నారు. దీనికితోడు మద్యం సేవించి నడపడం, హెల్మెట్‌ లేకుండా నడుపుతుండటంతో 90 శాతం ప్రమాదాలు, మృతులు ద్విచక్రవాహన దారులే నమోదవుతుండటం గమనార్హం. మృతి చెందుతున్న వారిలో ఎక్కువగా 30 ఏళ్ల లోపువారే ఉండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.

వాహన చోదకుల్లో తీవ్ర నిర్లక్ష్యం

ఎనిమిది నెలల్లో 1.85 లక్షల

కేసుల నమోదు

వేలాదిమందిపై డ్రంకన్‌ డ్రైవ్‌,

హెల్మెట్‌ లేని కేసులు

మితిమీరిన వేగంతో కొనితెచ్చుకుంటున్న ప్రమాదాలు

మొబైల్‌ మాట్లాడుతూ

బండ్లు నడుపుతున్న వారెందరో..

అవగాహన రాహిత్యం.. నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మనం చేసే డ్రైవింగ్‌ సరిగా లేకపోతే

మనతోపాటు ఎదుటి వారి ప్రాణాలకూ ముప్పు తెస్తోంది. ఓ వైపు రవాణా శాఖ అధికారులు, మరోవైపు పోలీసు అధికారులు ఎంత చెప్పినా వాహన చోదకులు అడ్డదిడ్డంగా వెళ్తుండటం పరిపాటిగా మారింది. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసే వారి వల్ల పద్ధతిగా వాహనాలు నడిపే వారికి

తీవ్ర అసౌకర్యం కలుగుతోంది.

భారీగా జరిమానాలు వేస్తున్నా...

అధిక స్పీడు వెళుతున్న వారికి స్పీడ్‌ గన్‌ల ద్వారా గుర్తించి భారీగా జరిమానా విధిస్తున్నాం. వారికి అవగాహనా క్లాసులు ఇస్తున్నాం. ప్రమాదానికి గురికాకుండా, ప్రాణాలు కాపాడటంలో భాగంగా అన్ని రకాలుగా చెబుతూనే ఉన్నాం. యువకుల్లో ముందుగా మార్పు రావాలి.

– వీర్రాజు, ఉప రవాణా కమిషనర్‌

మరిన్ని వార్తలు