-

మల్లాపురంలో సంబరాలు

28 Nov, 2023 02:26 IST|Sakshi
పురస్కారం అందుకున్న రైతు నారాయణప్ప

కళ్యాణదుర్గం: మండలంలోని మల్లాపురంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన రైతు నారాయణప్ప సోమవారం న్యూఢిల్లీలో ‘కర్మ వీర్‌ చక్ర’ పురస్కారం అందుకోవడంతో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. అవార్డు అందజేసే కార్యక్రమాన్ని సెల్‌ఫోన్లో వీక్షిస్తూ పలువురికి స్వీట్లు పంచిపెట్టారు. తమ కష్టానికి గౌరవం దక్కిందని నారా యణప్ప భార్య పార్వతి సంతోషం వెలిబుచ్చారు.

మంత్రి ఉషశ్రీ అభినందన..

కర్మవీర్‌ పురస్కారం అందుకున్న రైతుకు అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్‌ ఫోన్‌లో ఆయనను అభినందించారు. తమ ప్రాంత రైతుకు అంతర్జాతీయ స్థాయిలో పురస్కారం దక్కడం సంతోషకరమన్నారు. కొత్త తరహా పద్ధతుల్లో పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలిచారన్నారు. మారుమూల గ్రామమైన మల్లాపురంతో పాటు రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారన్నారు.

ఏటీఎం మోడల్‌తో గుర్తింపు..

రైతు నారాయణప్ప ఎనీ టైం మనీ (ఏటీఎం) పద్ధతితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సేంద్రియ పద్ధతిలో ఎరువులను తయారు చేసుకుని ఏడాది పొడవునా పంట దిగుబడి వచ్చేలా ఆయన అవలంబించిన పద్ధతికే ఎనీ టైం మనీ (ఏటీఎం) అనే పేరు వచ్చింది. తనకున్న పొలంలో 3.7 ఎకరాలలో మామిడి, మిగిలిన 40 సెంట్ల స్థలంలో 30 సెంట్లలో ఏటీఎం పద్ధతిలో సుమారు 20 రకాల పంటలను నారాయణప్ప సాగు చేశారు. పంట ఉత్పత్తుల్లో ఇంటికి సరిపడా ఉంచుకుని మిగిలిన వాటిని మార్కెట్‌కు తరలించేవారు. రూ.5 వేల పెట్టుబడితో ఏడాదికి రూ.2 లక్షల ఆదాయాన్ని గడిస్తూ రైతులకు రోల్‌ మోడల్‌గా నిలిచారు. గ్రామంలో తనతో పాటు ప్రస్తుతం 25 మంది రైతులకు ఏటీఎం మోడల్‌ను పరిచయం చేశారు. వీరిని చూసి పరిసర గ్రామాలకు చెందిన సుమారు 3,500 మంది రైతులు నారాయణప్ప బాటలో అడుగులేస్తున్నారు. నారాయణప్ప ఏటీఎం మోడల్‌పై ‘సాక్షి’లో మే 2న ప్రత్యేక కథనం కూడా ప్రచురితమైంది. ఈ క్రమంలోనే ఆయనకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి, ఆర్‌ఈఎక్స్‌, కర్మ వీర్‌ గ్లోబల్‌ ఫెలోషిప్‌ భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎజ్జీఓస్‌ (ఐకాంగో) అందించే అవార్డు వరించింది.

దిగ్గజాల సరసన..

అంతర్జాతీయ స్థాయి అవార్డు అందుకుని దిగ్గజాల సరసన నారాయణప్ప నిలిచారు. గతంలో ఈ అవార్డును వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలందించిన దివంగత శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌, క్రీడారంగంలో రాహుల్‌ ద్రావిడ్‌, పుల్లెల గోపీచంద్‌, కళా రంగంలో కాజోల్‌ తదితరులకు అందజేశారు. ఇప్పుడు వీరి సరసన నారాయణప్ప చోటు దక్కించుకోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు