-

చీటీల పేరుతో కుచ్చుటోపీ

28 Nov, 2023 02:26 IST|Sakshi
నిర్వాహకుడిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులు

అనంతపురం క్రైం: చీటీల పేరుతో మోసగించిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుని తమ డబ్బు ఇప్పించాలంటూ పోలీసులను బాధితులు ఆశ్రయించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆర్‌.విజయభాస్కరరెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎస్సీ కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఆర్డీటీలో పనిచేస్తున్న 60 మంది తోటమాలులతో రాయదుర్గం ప్రాంతానికి చెందిన చీటీల నిర్వాహకుడు వన్నూరు అనే వ్యక్తి సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరితో మూడు, నాలుగు చొప్పున చీటీలు వేయించుకున్నాడు. ఒక్కో చీటీకి 30 మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఈ లెక్కన మొత్తం నాలుగు చీటీలు నిర్వహిస్తూ వారం రోజుల క్రితం రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి ఉడాయించాడు. వెళ్లే సమయంలో ఓ మహిళతో నాలుగు తులాల బంగారు నగలు, రూ. 2 లక్షలు నగదు, మరొకరితో రూ.లక్ష చొప్పన తనకు అనువుగా ఉన్న వారందరితో డబ్బు, నగలు తీసుకుని పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితులు అతని సొంతూరుకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో సోమవారం పోలీసు స్పందన కార్యక్రమానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన అదనపు ఎస్పీ విజయబాస్కరరెడ్డి మాట్లాడుతూ... బాధితులకు న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. కాగా, పోలీసు స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై 119 వినతులు అందినట్లు ఏఎస్పీ తెలిపారు. సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలంటూ సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

కొండుపల్లి గనుల పరిశీలన

పెద్దవడుగూరు: మండలంలోని కొండుపల్లి గనులను నెల్లూరు మైనింగ్‌ సేప్టీ అధికారి కె.ఎ.నాయుడు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ.. గనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమతులు లేకుండా ఖనిజాన్ని వెలికి తీస్తున్న వారి వివరాలు ఆరా తీశారు. ప్రమాదం జరిగిన గనిని పరిశీలించారు. ఘటనపై నివేదిక రూపొందించి, ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

60 మందిని మోసగించి

ఉడాయించిన నిర్వాహకుడు

‘పోలీసు స్పందన’లో బాధితుల ఫిర్యాదు

మరిన్ని వార్తలు