-

రైతును రారాజును చేయాలన్నదే సీఎం లక్ష్యం

28 Nov, 2023 02:26 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి ఉషశ్రీ చరణ్‌ (చిత్రంలో) మాజీ ఎమ్మెల్యే విశ్వ

కూడేరు: అన్నదాతను రారాజును చేయాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని, ఇందులో భాగంగా రైతు సంక్షేమానికి అనేక పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారని మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్‌ అన్నారు. కూడేరు మండలం పి.నారాయణపురం – తిమ్మాపురం గ్రామాల మధ్య సుమారు రూ.3.5 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే వ్యవసాయం సుభిక్షంగా సాగుతోందన్నారు. పంటల సాగుకు విద్యుత్‌ సమస్య లేకుండా చేశారన్నారు. లో ఓల్టేజీ సమస్య పరిష్కారానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 43 సబ్‌ స్టేషన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఒక్క ఏడాదిలోనే ఇన్ని సబ్‌స్టేషన్లు మంజూరు కావడం ఏపీ చరిత్రలోనే లేదన్నారు. ఆర్‌బీకేల ఏర్పాటుతో రైతు ముంగిటకే సేవలు అందుతున్నాయన్నారు. టీడీపీ పాలనలో వ్యవసాయాన్ని దండగ అంటూ పేర్కొన్న అప్పటి సీఎం చంద్రబాబు... అదే దిశలో అన్నదాతల బతుకులు ఛిద్రం చేస్తూ వచ్చారన్నారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... నూతన సబ్‌ స్టేషన్‌ ప్రారంభంతో తిమ్మాపురం, పి.నారాయణపురం, చోళసముద్రం, జయపురం గ్రామాలతో పాటు ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాలకు లో–ఓల్టేజీ సమస్యల పరిష్కారమవుతోందన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సురేంద్ర, సర్పంచ్‌లు హనుమంతరెడ్డి, ఓబుళమ్మ, ఎంపీపీ నారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు తుప్పటి అశ్వని, వైస్‌ ఎంపీపీ సుబ్బమ్మ, అగ్రి అడ్వైజరీ మండల కమిటీ చైర్‌పర్సన్‌ నిర్మలమ్మ, వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, తహసీల్ధార్‌ శేషారెడ్డి, ఎంపీడీఓ ఎంకే బాషా, ఏఓ విజయకుమార్‌, ట్రాన్స్‌కో ఏఈ గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కేవీ ఉషశ్రీచరణ్‌

మరిన్ని వార్తలు