-

ఓటు హక్కు పునరుద్ధరించి ఎన్నికలు జరపాలి

28 Nov, 2023 02:26 IST|Sakshi
కలెక్టర్‌కు అర్జీ అందజేసేందుకు వచ్చిన మత్స్యకార సంఘం నాయకులు

అనంతపురం అర్బన్‌: జిల్లాలోని 30 మత్స్యకార సంఘాలకు ఓటు హక్కు పునరుద్ధరించిన తర్వాత జిల్లా మత్స్య సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్‌ గౌతమికి ఏపీ సంప్రదాయ మత్స్యకారుల సంఘం, బెస్తసేవా సంఘం నాయకులు విన్నవించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ను సంఘం నాయకులు కె.వి.రమణ, రామకృష్ణ, లక్ష్మీనారాయణ, నాగార్జున, నాగరాజు తదితరులు కలసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. ఏళ్లుగా జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా కొందరు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారన్నారు. వీరంతా తమకు అనుకూలంగా ఉన్న సంఘాలను మాత్రమే మనుగడలో ఉంచి, మిగిలిన వాటిని రద్దు చేస్తూ వచ్చారన్నారు. దాదాపు 30 సంఘాలకు ఓటు హక్కు లేకుండా చేశారన్నారు. అక్రమంగా ఓటు హక్కు తొలగించిన సంఘాల గుర్తింపును పునరుద్ధరించిన తర్వాత ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

3న కోటంకలో

రాష్ట్రస్థాయి భజన పోటీలు

గార్లదిన్నె: మండలంలోని కోటంక కొండల్లో వెలసిన గుంటికింద సుబ్బరాయుడు స్వామి ఆలయంలో డిసెంబర్‌ 3న కార్తీక దీపోత్సవాన్ని పురస్కరించుకుని అదే రోజు రాత్రి రాష్ట్రస్థాయి భజన పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ సుబ్బిరెడ్డి, ఆలయ ఈఓ బాబు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోటీల్లో పాల్గొనే భజన బృందం రూ.300 ప్రవేశ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు 11 స్థానాల్లో విజేత బృందాలను ప్రకటించి, సభ్యులను నగదు పురస్కారాలతో సత్కరించనున్నారు. పూర్తి వివరాలకు 78010 35551, 94916 61919లో సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు