4న రాప్తాడులో సామాజిక సాధికార యాత్ర

29 Nov, 2023 01:50 IST|Sakshi
గవర్నర్‌కు జ్ఞాపిక అందజేస్తున్న వీసీ జింకా రంగజనార్దన, రిజిస్ట్రార్‌ శశిధర్‌

కనగానపల్లి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగనన్న ప్రభుత్వంలో కలిగిన మేలును వివరించేందుకు వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర డిసెంబర్‌ నాలుగో తేదీ రాప్తాడులో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కనగానపల్లి మండలం మద్దెల చెరువు, భానుకోట, కేఎన్‌ పాళ్యం, నరసంపల్లి, తగరకుంట గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. సామాజిక సాధికార యాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి వందల సంఖ్యలో ప్రజలు వచ్చేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భాగ్యమ్మ, జెడ్పీటీసీ మారుతీ ప్రసాద్‌, మండల అగ్రీ బోర్డు చైర్మన్‌ వెంకట రాముడు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ అమరనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జేఎన్‌టీయూ స్నాతకోత్సవ నిర్వహణకు అనుమతి

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం స్నాతకోత్సవం నిర్వహించడానికి గవర్నర్‌/ ఛాన్సలర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అనుమతి ఇచ్చారు. వీసీ జింకా రంగజనార్దన, రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌ రాజభవన్‌లో గవర్నర్‌ను కలిసి విన్నవించారు. స్నాతకోత్సవ నిర్వహణకు ఆయన సమ్మతించారని, తేదీ త్వరలోనే ఖరారు చేస్తామన్నారని వీసీ వెల్లడించారు.

అందరికీ ఆమోదయోగ్యంగానే అర్బన్‌ లింక్‌ రోడ్లు

అనంతపురం కార్పొరేషన్‌/ టౌన్‌: నగర ప్రజలందరికీ ఆమోదయోగ్యంగానే అర్బన్‌ లింక్‌ రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్‌ పేర్కొన్నారు. మంగళవారం డ్వామా కాన్ఫరెన్స్‌ హాల్‌లో జేసీ కేతన్‌గార్గ్‌ అధ్యక్షతన అర్బన్‌ లింక్‌ రోడ్లపై సలహాలు, సూచనలపై సమావేశం నిర్వహించారు. పలువురు ముస్లిం మత పెద్దలు తమ అభిప్రాయాలు, సూచనలను అర్జీల ద్వారా సమర్పించారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ మాట్లాడుతూ అర్జీలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జాతీయ రహదారుల అధికారులతో చర్చించి అర్బన్‌ లింక్‌ రోడ్ల నిర్మాణాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మేయర్‌ వసీం, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీమ్‌ అహ్మద్‌, నగర పాలక కమిషనర్‌ భాగ్యలక్ష్మి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ అధికారి మహ్మద్‌ రఫి, ఆర్డీఓ గ్రంధి వెంకటేష్‌, జాతీయ రహదారుల ఈఈ మధుసూదన్‌తో పాటు ముస్లిం మత పెద్దలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు