శ్రీనివాస నగర్‌లో చోరీ

29 Nov, 2023 01:50 IST|Sakshi
చోరీ జరిగిన ఇంటిని పరిశీలిస్తున్న త్రీటౌన్‌ సీఐ ధరణీకిషోర్‌

అనంతపురం క్రైం: నగరంలోని శ్రీనివాస నగర్‌లో నివాసముంటున్న న్యాయవాది ఆనంద్‌ ఇంట్లో దొంగలు పడ్డారు. సోమవారం ఆనంద్‌, తన భార్య సుజాతతో కలసి శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బలో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటికి వేసిన గ్రిల్‌ తాళాలు బద్ధలుగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన దంపతులు లోపలకు వెళ్లి పరిశీలించారు. చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని సమాచారం అందించడంతో త్రీ టౌన్‌ సీఐ ధరణీకిషోర్‌, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. కుమార్తెను పలకరించి త్వరగా వద్దామని భావనతో ఇంటి మెయిన్‌ డోర్‌కున్న గ్రిల్‌కు మాత్రమే తాళం వేసి ఊరెళ్లినట్లుగా గుర్తించారు. అయితే అనుకున్న సమయానికి వారు రాలేకపోవడం దొంగలకు అనువుగా మారిందన్నారు. బీరువాలోని 7 తులాల బంగారు నగలు, 50 తులాల వెండి సామగ్రిని అపహరించుకెళ్లారు. సీసీ కెమెరాలకు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో అవి పనిచేయలేదు. దీంతో చుట్టుపక్కల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

నగలు, నగదు అపహరణ

గుంతకల్లుటౌన్‌: పట్టణంలోని ఉమామహేశ్వరనగర్‌కు చెందిన రోషమ్మ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన మంగళవారం వెలుగు చూసింది. ఇంటి తాళాలను పగులగొట్టి లోనికి చొరబడిన దుండుగులు బీరువాలోని అర తులం బంగారు కమ్మలు, రూ.40 వేలు నగదు అపహరించుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.

యువకుడిని కాపాడిన పోలీసులు

పెద్దపప్పూరు: జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోబోయిన యువకుడిని సకాలంలో పోలీసులు కాపాడారు. యువకుడిని యాడికి గ్రామానికి చెందిన రంగస్వామిగా గుర్తించారు. జూటురు రైల్వే స్టేషన్‌ సమీపంలో మంగళవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోబోతుండగా స్టేషన్‌ మాస్టర్‌ గుర్తించి, పోలీసుల సాయంతో అడ్డుకున్నారు. అనంతరం యువకుడికి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు