ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

29 Nov, 2023 01:50 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న నాయకులు

అనంతపురం అర్బన్‌: ప్రభుత్వం దృష్టికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్‌బాబు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ ఆర్‌.ఎన్‌.దివాకర్‌రావు పేర్కొన్నారు. అనంతపురంలోని కృష్ణకళామందిర్‌ ఆవరణలో ఉన్న రెవెన్యూభవన్‌లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సంఘం ప్రథమ మహాసభ పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో దివాకర్‌రావు, సురేష్‌బాబు మాట్లాడారు. జేఏసీ అమరావతి అనుబంధంగా ఉన్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహాసభ డిసెంబరు 10న విజయవాడలోని జింఖానా మైదానంలో జరుగుతుందన్నారు. మహాసభకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇతర పెద్దలనూ ఆహ్వానించామన్నారు. వారి ద్వారా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించబోతున్నట్లు తెలిపారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రైవేటు ఏజెన్సీల బారి నుంచి తప్పించి ఆప్కాస్‌ ఏర్పాటుతో ప్రభుత్వం ఊరట కల్పించిందన్నారు. అయితే కనీస వేతనం అమలు కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగులు సతమతమవుతున్నారన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలను పునరుద్ధరించాలని కోరనున్నట్లు తెలిపారు. మహాసభకు ఉద్యోగులు జిల్లా నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ అసోసియేట్‌ చైర్మన్‌ మల్లరాముడు, నాయకులు రమేష్‌, పి.రామకృష్ణ, రాఘవేంద్ర, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ దివాకర్‌రావు

మరిన్ని వార్తలు