మామిడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టండి

29 Nov, 2023 01:52 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: మామిడిలో పూమొగ్గ రావడానికి వాతావరణం అనుకూలంగా ఉన్న కీలక సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా ఉద్యానశాఖ అధికారి జి.చంద్రశేఖర్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వేలాది ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నందున రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు, ఇతర వాతావరణ పరిస్థితులను బట్టి మామిడిలో పూమొగ్గ తొడగడానికి అవకాశం ఎక్కువగా ఉందన్నారు. డిసెంబర్‌ మొదటి వారంలో ఒక నీటి తడి ఇవ్వాలన్నారు. ఈలోపు ఒక పదును వర్షం వస్తే నీటి తడి కూడా అవసరం లేదన్నారు. పూత ఆరోగ్యంగా రావడానికి ఒక లీటర్‌ నీటికి 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్‌ 2 గ్రాములు సల్ఫర్‌ కలిపి వెంటనే పిచికారీ చేయాలన్నారు. మళ్లీ వారం రోజుల తర్వాత లీటర్‌ నీటికి 0.5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్‌ 2 మి.లీ హెక్సాకొనజోల్‌ కలిపి పిచికారీ చేయాలన్నారు. మళ్లీ వారం తర్వాత ఒక లీటర్‌ నీటికి 10 గ్రాములు 13–0–45 2 మి.లీ క్లోరిపైరిపాస్‌ లేదా 1.5 మి.లీ లాబ్డాసైహలోత్రీన్‌ కలిపి పిచికారీ చేస్తే పూత, పిందె, దిగుబడులు బాగా వస్తాయన్నారు. పిచికారీ సమయంలో కాండం బాగా తడిచేలా చూసుకుంటే బెరడులోపల ఉన్న తేనెమంచు పురుగు నశిస్తుందన్నారు.

శ్రీసత్యసాయి జిల్లా ఉద్యానశాఖ అధికారి జి.చంద్రశేఖర్‌

మరిన్ని వార్తలు