1.52 కోట్లు దాటిన బియ్యం కార్డులు

2 Nov, 2020 20:19 IST|Sakshi

4.47 కోట్ల మందికి లబ్ధి

ప్రతి నెలా పెరుగుతున్న కార్డుల సంఖ్య

పదెకరాలున్న వారూ అర్హులే

అధికారుల చుట్టూ తిరిగే పని లేదు

సాక్షి, అమరావతి: పదెకరాలున్నా వారు కూడా బియ్యం కార్డు పొందేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో ప్రతినెలా కొత్తగా లక్షలాది మందికి లబ్ధి చేకూరుతోంది. గతంలో 2.5 ఎకరాల మాగాణి లేదా ఐదు ఎకరాల్లోపు మెట్ట భూమి ఉన్నవారే బియ్యం కార్డు పొందేందుకు అర్హులుగా ఉండేవారు. ప్రస్తుతం మూడు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల్లోపు మెట్ట భూమి ఉన్నవారు లేదా రెండూ కలిపి పది ఎకరాలున్నా కార్డు తీసుకునేందుకు అర్హులే. దీంతో నానాటికీ బియ్యం కార్డుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సంక్షేమ పథకాలు పేదల హక్కుగా భావిస్తున్న ప్రభుత్వం.. వారికి బియ్యం కార్డులు కూడా ఎప్పటికప్పుడు మంజూరు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,52,70,217 బియ్యం కార్డులున్నాయి. ఇందులో 4,47,45,668 కుటుంబ సభ్యుల (యూనిట్లు) పేర్లు నమోదై ఉన్నాయి. జూన్‌లో 1,47,25,348 కార్డులు ఉండగా, జూలైలో 1,49,38,211, ఆగస్టులో 1,50,15,765, సెప్టెంబర్‌లో 1,50,80,690 కార్డులు ఉండగా.. ఆ సంఖ్య ప్రస్తుతం 1,52,70,217కి చేరింది. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నప్పటికీ వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసిన తర్వాత అర్హత ఉంటే చాలు గడువులోగా కార్డులను మంజూరు చేస్తున్నారు. 

త్వరలో ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం
పేదల ఇళ్లకే వెళ్లి నాణ్యమైన బియ్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జనవరి నుంచి ఈ విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 3,100 కోట్లు కేటాయించింది. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే అవసరమైన మినీ ట్రక్కులను కొనుగోలు చేసేందుకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది.

ప్రభుత్వం భారంగా భావించడం లేదు
అర్హులందరికీ బియ్యం కార్డులు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోపే సంబంధిత కుటుంబ సభ్యుల చేతికి కార్డు ఇస్తున్నాం. దీనిని ప్రభుత్వం భారంగా భావించడం లేదు. ఎంత ఖర్చయినా పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయం. కార్డులు మంజూరు చేయడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. 
- కోన శశిధర్‌, ఎక్స్‌-అఫీషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ

జిల్లాలవారీగా ఇప్పటివరకు జారీ చేసిన బియ్యం కార్డులు, వాటిలోని కుటుంబ సభ్యుల వివరాలిలా..

జిల్లా   కార్డులు కుటుంబ సభ్యులు (యూనిట్లు)
అనంతపురం 12,73,601 39,34,160
చిత్తూరు 11,88,779 37,04,862
తూర్పు గోదావరి 17,03,597 48,21,556
గుంటూరు 15,47,127 43,39,371
వైఎస్సార్ 8,37,057  25,29,877
కృష్ణా 13,47,292 38,28,203
కర్నూలు 12,43,324 39,25,629
నెల్లూరు 9,33,193 25,54,168
ప్రకాశం 10,25,455 30,17,497
శ్రీకాకుళం 8,41,047 24,93,119
విశాఖపట్నం 13,20,321 38,73,231
విజయనగరం 7,16,349 21,10,628
పశ్చిమ గోదావరి 12,93,075 36,13,367
మొత్తం 1,52,70,217 4,47,45,668
మరిన్ని వార్తలు