ఆంధ్రప్రదేశ్‌లో 10 రోజులు అకాల వర్షాలు

14 Apr, 2021 03:14 IST|Sakshi

15, 16 తేదీల్లో విస్తారంగా వానలు

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు, ఉత్తర బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అధిక పీడన ప్రాంతాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 10 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా అకాల వర్షాలు ఎక్కువగా పడే సూచనలున్నాయి. ముఖ్యంగా రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బుధవారం నుంచి అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాయలసీమతో పాటు గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు పడతాయని తెలిపారు.

ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతాలకు మాత్రమే వర్షసూచన ఉందన్నారు. సముద్రతీర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపారు. జార్ఖండ్, ఒడిశాల మీదుగా ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించి ఉంది. దీంతోపాటు తేమగాలుల ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో  అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి.  

మరిన్ని వార్తలు