జేసీ దివాకర్‌రెడ్డికి 100 కోట్ల జరిమానా

1 Dec, 2020 08:07 IST|Sakshi

సాక్షి, అనంతపురం  : యాడికి: మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డికి ఏపీ మైనింగ్‌ శాఖ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. ఉపాధి కల్పన పేరిట దాదాపు 1,605 ఎకరాల భూమిలో లక్షలాది మెట్రిక్‌ టన్నుల డోలమైట్, లైమ్‌స్టోన్‌ను అమ్ముకున్న ఆయనకు రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఈ మొత్తం చెల్లించని పక్షంలో ఆస్తుల జప్తునకు ఆదేశించింది. త్రిశూల్‌ íసిమెంట్‌ పరిశ్రమను స్థాపించేందుకు జేసీ దివాకర్‌రెడ్డి 13ఏళ్ల క్రితం తన పని మనుషుల పేరిట అనుమతులకు దరఖాస్తు చేశారు. అనుమతులు మంజూరయ్యాక వారికి కొంత భాగం కేటాయించి తన కుటుంబ సభ్యులకు 80 శాతంపైగా వాటాలను బదలాయించుకున్నారు. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్‌సీపీ నాయకుడు కందిగోపుల మురళీప్రసాద్‌రెడ్డి ‘త్రిశూల్‌’ అక్రమాలపై అప్పట్లో కోర్టులో దావా వేశారు. దీంతో జేసీ మోసాలు వెలుగుచూశాయి.

త్రిశూల్‌ పేరుతో 1,605 ఎకరాల భూమిని తీసుకుని ఏళ్లు గడిచినా అక్కడ పరిశ్రమలు స్థాపించకపోవడం అతిపెద్ద మోసమైతే, ఆ భూములలో నుంచి విలువైన ఖనిజాన్ని లక్షలాది మెట్రిక్‌ టన్నులు తవ్వి విక్రయించారు. అంతేకాక.. గతంలోనే 14 లక్షల మెట్రిక్‌ టన్నుల లైమ్‌స్టోన్, డోలమైట్‌ ఖనిజాన్ని తవ్వి విక్రయించుకున్నారనీ నిర్ధారించారు. ఈ ఖనిజం విలువ రూ.100 కోట్లు ఉంటుందని, ఆ సొమ్మును జరిమానాగా చెల్లించాలని.. లేకపోతే ఆర్‌ అండ్‌ ఆర్‌ యాక్ట్‌ కింద ఆస్తుల జప్తు చేపడతామని గనుల శాఖ అధికారులు గత వారం నోటీసులు జారీచేశారు. (ఏం 'జేసీ'నారో?)

సమాచారమివ్వని తహశీల్దార్లు
త్రిశూల్‌ సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటులో జేసీ అండ్‌ కో అక్రమాలను నిగ్గు తేల్చిన మైనింగ్‌ అధికారులు జరిమానా విధించడానికి ముందే తాడిపత్రి నియోజకవర్గంలోని తాడిపత్రి, పెద్దపప్పూరు, యాడికి, పెద్దవడుగూరు మండలాల తహసీల్దార్లకు జేసీ దివాకర్‌రెడ్డికి సంబంధించిన ఆస్తులను గుర్తించి నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం. కానీ, వారు నివేదికను ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో జేసీ ఆస్తుల వివరాలను ఇవ్వాలని మైనింగ్‌ అధికారులు మరోసారి ఆయా తహశీల్దార్లను కోరినట్లు తెలిసింది.  (ఉల్లం‘గనుల్లో బినామీలు’)

మరిన్ని వార్తలు