తుక్కు విక్రయంతో రైల్వేకు రూ.100 కోట్ల ఆదాయం 

14 Jul, 2022 04:08 IST|Sakshi

103 రోజుల్లోనే ఆర్జించిన దక్షిణ మధ్య రైల్వే 

ఈ ఏడాది నుంచే ‘జీరో స్క్రాప్‌’ పాలసీ అమలు  

సాక్షి, అమరావతి:  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తుక్కు ఇనుము విక్రయం ద్వారా దక్షిణ మధ్య రైల్వే 103 రోజుల్లోనే రూ.100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రైల్వేలో ఇనుప తుక్కు విపరీతంగా పేరుకుపోతుండగా.. చోరీలు జరగడంతోపాటు కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా దారితీస్తోంది. దీనికి పరిష్కారంగా దక్షిణ మధ్య రైల్వే ‘జీరో స్క్రాప్‌ పాలసీ’ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇనుప తుక్కును వదిలించుకునేందుకు దానిని ఎప్పటికప్పుడు విక్రయించేలా అనుమతి ఇచ్చింది. డివిజన్ల పరిధిలోని అన్ని సెక్షన్లలో ఇనుప తుక్కును గుర్తించి మ్యాపింగ్‌ చేస్తున్నారు.

ట్రాక్‌ల పక్కన ఇనుప తుక్కు గరిష్టంగా నెల రోజుల కంటే ఉండటానికి వీల్లేదని ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులకు స్పష్టం చేశారు. విరిగిన రైలు పట్టాలు, పీ–వే ఐటమ్స్, లోకోలు, కోచ్‌లు, వేగన్లకు సంబంధించి తుక్కును ఎప్పటికప్పుడు మ్యాపింగ్‌ చేసి ఇ–ప్రొక్యూర్‌మెంట్‌కు అందుబాటులో ఉంచుతున్నారు. అందుకోసం యూజర్‌ డిపో మాడ్యూల్‌ను అన్ని స్టోర్‌ డిపోల వద్ద ఉంచారు. ఈ విధానం సత్ఫలితాలిస్తోంది. ఇంతకుముందు ప్రతి మూడు నెలలకు ఒకసారి తుక్కును విక్రయించేవారు. దీనివల్ల ఇనుము తుప్పు పట్టి సరైన ధర వచ్చేది కాదు.

ప్రస్తుతం ఎప్పటికప్పుడు తుక్కును విక్రయిస్తుండటంతో అధిక ధర వస్తోంది. రికార్డు స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 103 రోజుల్లోనే తుక్కు విక్రయాలతో ఏకంగా రూ.100 కోట్ల ఆదాయం రావడం విశేషం. 2021–22లో మొదటి మూడు నెలల్లో రూ.51 కోట్ల ఆదాయం రాగా, 2022–23లో రూ.100 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. రానున్న రోజుల్లో జీరో స్క్రాప్‌ పాలసీని మరింత సమర్థంగా అమలు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు అన్ని డివిజన్ల అధికారులను సన్నద్ధం చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు