రెండేళ్లలో 10,000 మంది నర్సులు

8 Nov, 2020 04:21 IST|Sakshi

ప్రాథమిక ఆరోగ్యంలో దేశంలో అగ్రగామిగా నిలవబోతున్న ఏపీ 

ఇప్పటికే 4 వేల మంది నియామకానికి కేంద్రం అనుమతి 

వీళ్లందరికీ ఇగ్నో ద్వారా ఆరు మాసాల ప్రత్యేక శిక్షణ 

మిగతా 6 వేల మంది నియామకానికి త్వరలో అనుమతి 

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో రెండు సంవత్సరాల్లో 10 వేల మంది నర్సులను నియమించేందుకు కసరత్తు మొదలైంది. ప్రాథమిక ఆరోగ్యం పరిపుష్టం చేయడంలో భాగంగా సర్కారు ఈ ప్రక్రియను చేపట్టింది. కుగ్రామంలోని ప్రజలకు కూడా ప్రాథమిక వైద్యం అందించాలని, దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఆరోగ్య సిబ్బందిని నియమించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవస్థను రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగా  వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ (హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లు)ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలన్నింటినీ వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌గా ఉన్నతీకరిస్తున్నారు. మొత్తం 10,030 హెల్త్‌ కినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 8,615 క్లినిక్స్‌కు కొత్తగా భవన నిర్మాణాలు చేపడుతుండగా, మిగతా వాటికి బిల్డింగ్‌లు ఉన్నాయి.  

► మొత్తం 10,030 హెల్త్‌ క్లినిక్స్‌లో బీఎస్సీ నర్సింగ్‌ చదివిన అభ్యర్థులను నియమిస్తున్నారు. 
► ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా కొత్తగా చేపడుతున్న వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌కు జాతీయ హెల్త్‌ మిషన్‌ నిధులిస్తోంది. 
► ప్రతి కేంద్రంలోనూ ఒక బీఎస్సీ నర్సింగ్‌ అభ్యర్థి ఉండాలి. ఇప్పటికే 4,060 మంది నర్సుల నియామకానికి కేంద్రం అనుమతించింది. మిగతా 6 వేల నియామకాలకు త్వరలోనే అనుమతివ్వనుంది. 
► ఎంపికైన నర్సులకు ఆరు మాసాలు ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ) నిపుణులు శిక్షణ ఇస్తారు. 
► శిక్షణ సమయంలో నర్సులకు స్టైఫండ్‌తో పాటు అకామిడేషన్, భోజన వసతి కల్పిస్తారు. 
► కొత్త నిర్మాణాల కోసం రూ.1,745 కోట్లు వ్యయం చేస్తున్నారు. భారతదేశంలో ఎక్కువ హెల్త్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్‌లోనే. ప్రతి హెల్త్‌కినిక్‌కూ పీహెచ్‌సీతో అనుసంధానం చేస్తారు.  

హెల్త్‌ క్లినిక్‌లలో 12 రకాల సేవలు
► గర్భిణులకు, చిన్నారులకు ప్రత్యేక సేవలు 
► నవజాత శిశువులు టీకాలు   
► చిన్నారులు, యుక్త వయసు వారికి వైద్య సేవలు 
► కుటుంబ నియంత్రణకు సంబంధించి ప్రత్యేక సేవలు 
► సాంక్రమిక వ్యాధులకు గురికాకుండా పటిష్ట చర్యలు
► సాంక్రమిక వ్యాధుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం 
► మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి రాకుండా చర్యలు తీసుకోవడం 
► కన్ను, చెవి సమస్యలను ముందే పరిష్కరించేలా చర్యలు 
► సాధారణ ఆరోగ్య సంబంధిత సేవలు 
► వృద్ధుల ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు 
► అత్యవసర సేవల్లో భాగంగా వైద్యం 
► చిన్న చిన్న మానసిక సమస్యలకు ప్రాథమిక దశలోనే స్క్రీనింగ్‌ 

ముమ్మరంగా వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణం  
ప్రస్తుతం 8,604 భవన నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్‌ విభాగం ఈ పనులను చేపట్టింది. 5,010 భవనాలు ఎర్త్‌ వర్క్‌ దశలో ఉన్నాయి. మరో 1,519 బేస్‌మెంట్‌ లెవెల్‌కు వచ్చాయి. వీలైనంత త్వరలో అన్నింటినీ పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం. యథావిధిగా నర్సుల నియామకం చేపడతాం. 
– అనిల్‌ కుమార్‌ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ  

>
మరిన్ని వార్తలు