ఏజెన్సీలో 102 ఎకరాల్లో గంజాయి ధ్వంసం

14 Nov, 2021 05:11 IST|Sakshi
జీకే వీధి మండలంలో గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్న దృశ్యం

పాడేరు/గూడెంకొత్తవీధి: విశాఖ ఏజెన్సీలో శనివారం 102 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో జాయింట్‌ డైరెక్టర్‌ సతీష్‌కుమార్, సూపరింటెండెంట్‌ గోపాల్‌ పర్యవేక్షణలో జి.మాడుగుల మండలంలోని బీరం పంచాయతీ వి.కోడాపల్లి ప్రాంతంలో 54 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. రెండు లక్షల 70 వేల మొక్కలను నరికివేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈబీ జాయింట్‌ డైరెక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌ఈబీ బృందం, సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు జి.కె.వీధి మండలంలో సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐ షమీర్‌ ఆధ్వర్యంలో రింతాడ పంచాయతీ కోరాపల్లి గ్రామంలో గంజాయి నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం గంజాయి సాగు జోలికి పోమని వారితో తీర్మానం చేయించారు. 8 ఎకరాల్లో తోటలను ధ్వంసం చేసి నిప్పంటించారు. చింతపల్లి మండలంలోని కుడుమసారి పంచాయతీ కోటగున్నెల, లోతుగెడ్డ పంచాయతీ మేడూరు గ్రామాల్లో 40 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం చేశారు.

760 కిలోల గంజాయి స్వాధీనం
కశింకోట: విశాఖ జిల్లా మండలంలోని బయ్యవరం వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దర్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ జి.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఏజెన్సీలోని జి.మాడుగుల మండలం నుంచి గంజాయి కొనుగోలు చేసి చెన్నైకు బొలెరో వాహనంలో తరలిస్తుండగా బయ్యవరం వద్ద పట్టుకున్నామన్నారు. ఈ సందర్భంగా చీడికాడకు చెందిన గ్రామానికి చెందిన డ్రైవర్‌ కొల్లివలస శ్రీను, బుచ్చియ్యపేట మండలం అప్పన్నపాలెం గ్రామానికి చెందిన జి.బత్తుల సంతోష్‌లను అరెస్టు చేశామన్నారు. 760 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, దీని ఖరీదు రూ.15 లక్షలు ఉంటుందన్నారు. 

మరిన్ని వార్తలు