11.99 లక్షల మందికి 104 కాల్‌ సెంటర్‌ వైద్యసేవలు

30 Nov, 2021 04:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్‌ సెంటర్‌ ద్వారా ఇప్పటి వరకు 11,99,927 మంది వైద్యసేవలు పొందారు. కరోనా తీవ్ర వ్యాప్తి సమయంలో ప్రభుత్వాస్పత్రుల్లో మినహా ప్రైవేటు ఆస్పత్రులన్నీ ఔట్‌ పేషెంటు సేవల్ని నిలిపేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఫోన్‌ చేస్తే వైద్యసేవలు అందేలా ప్రభుత్వం 104 కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి భారీగా వైద్యులను నియమించింది. ఇప్పటి వరకు వైద్యసేవలు పొందిన వారిలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణై ఇంట్లో చికిత్స పొందుతున్నవారే 10.14 లక్షలమంది ఉన్నారు. 5,579 మంది పీడియాట్రిక్‌ వైద్యసేవలు పొందగా మిగిలినవారు వివిధ వ్యాధులకు సలహాలు తీసుకున్నారు. 

13,797 సచివాలయాల పరిధిలో నిల్‌ 
రాష్ట్రవ్యాప్తంగా 15,001 గ్రామ, వార్డు సచివాలయాలుండగా ప్రస్తుతం 13,797 సచివాలయాల పరిధిలో కరోనా యాక్టివ్‌ కేసులు లేవు. 859 సచివాలయాల పరిధిలో ఒక్కో యాక్టివ్‌ కేసు, 222 సచివాలయాల పరిధిలో రెండేసి   కేసులున్నాయి. 116 సచివాలయాల పరిధిలో 3 నుంచి 9, ఐదు సచివాలయాల పరిధిలో 10 నుంచి 19, రెండు సచివాలయాల పరిధిలో 20 నుంచి 29 యాక్టివ్‌ కేసులున్నాయి.  గత వారం రోజుల్లో ప్రభుత్వం రోజుకు సగటున 27,656 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించింది. 

90 శాతం, అంతకుమించి టీకాలు..  
రాష్ట్రంలో 12,834 సచివాలయాల పరిధిలో 18 ఏళ్లు పైబడిన వారిలో 90 శాతం, అంతకంటే ఎక్కువమందికి ప్రభుత్వం కరోనా టీకాలు వేసింది.  గ్రామీణ ప్రాంతాల్లో 11,137 సచివాలయాలకుగాను 9,345, పట్టణ ప్రాంతాల్లో 3,864 సచివాలయాలకుగాను 3,489 సచివాలయాల పరిధిలో 90 శాతం, అంతకంటే ఎక్కువ మందికి టీకా వేశారు.   

మరిన్ని వార్తలు