విత్తనం to విక్రయం... భూమి పుత్రులకు భరోసా

30 May, 2021 05:58 IST|Sakshi

రైతన్నల నేస్తాలు ఆర్బీకేలు

ప్రభుత్వానికి రైతుకు మధ్య అనుసంధాన కర్తలు

అన్నదాతకు అవసరమయ్యే సేవలన్నీ ఒకేచోట..

విత్తనం నుంచి విక్రయం వరకు అన్నీ ఇంటి ముంగిటే

బీమా నుంచి పంట నమోదు వరకూ ఎన్నో సేవలు..

ప్రైవేటు వ్యాపారులు,డీలర్ల ఆగడాలకు స్వస్తి

దళారులు మాయం.. మద్దతు ధరల్లోనూ సాయం..

ఆర్బీకేలతో పల్లెల్లో పెను విప్లవం

ఏటికి ఎదురీదిన రైతు బతుకులు ఇప్పుడు సేదతీరుతున్నాయి. విత్తనాల కోసం గంగ దాటెళ్లకే చెల్లమ్మా అనే హెచ్చరికలు ఇపుడు వినిపించడంలేదు. యూరియా కోసం వేకువ నుంచే అల్లంత దూరం కనిపించే ’చీమల దండులు’ కనుమరుగయ్యాయి. దళారుల దందాకు అరదండాలు పడ్డాయి. నాగేటి చాళ్లల్లో నవోదయం వికసించింది. పల్లెల్లో రుతు రాగం వినిపిస్తోంది. సాగుబడికి స్వేచ్ఛ, అన్నదాతకు విముక్తి దొరికాయి.. రైతు ఈ వేళ దేనికీ తలవంచాల్సిన పని లేదు. ఆత్మగౌరవం, గుండె నిబ్బరంతో తనున్న చోటుకే అన్నింటినీ తెప్పించుకుంటున్నాడు. అందర్నీ రప్పించుకుంటున్నాడు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టితో చేసిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) ప్రయోగం స్వల్పకాలంలోనే సత్ఫలితాలను ఇచ్చింది. ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చినప్పుడు– ఆశ లావు పీక సన్నం– అని ఎకసెక్కం ఆడిన నోళ్లు ఇప్పుడు మూత పడ్డాయి. పల్లెల్లో పెను విప్లవానికి ఆర్బీకేలు నాంది పలికాయి..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఒకటి చొప్పున 10,778 డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. నవరత్నాల్లో భాగంగా ఏర్పాటైన ఈ కేంద్రాల లక్ష్యం పంట ఉత్పాదకత మెరుగుపర్చడం, సాగు ఖర్చు తగ్గించడం. దీనికి అవసరమైన అన్ని రకాల ఉత్పాదకాలు–విత్తనం మొదలు విక్రయం వరకు రైతు ఇంటి ముంగిటే అందించడం లక్ష్యం. నాణ్యతలో రాజీ లేకుండా సరఫరాలో జాప్యం కాకుండా రైతు సేవలన్నీ ఒకే చోట అందించడమే ఉద్దేశం.

అందుబాటులో అన్ని సేవలు..
ఆర్బీకేలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. వ్యవసాయ విస్తరణలో భాగంగా శాస్త్రవేత్తలు ఆవిష్కరించే కొత్త విషయాలు రైతులకు చేరుతున్నాయి. నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర సామాగ్రి తమ చేరువలోకి వచ్చాయని రైతన్నలు సంబరపడుతున్నారు. ఏ ఊరు వెళ్లినా ఈ విషయాన్ని గమనించవచ్చునని తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన రైతు త్రినాధరెడ్డి అంటున్నారు. రైతు భరోసా కేంద్రాలు గ్రామ సీమల్లో విప్లవాన్ని తెచ్చాయి. గతంలో మాదిరి ఏ రైతూ ఉసూరుమంటూ పట్టణాల బాట పట్టడం లేదు. చిన్న, సన్న, మధ్యకార రైతులెవ్వరూ వ్యవసాయ ఉత్పాదకాల కోసం బండ్లు కట్టుకుని వెళ్లడం లేదు.

ఇ–పంట నమోదు పెద్ద ముందడుగు...
ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఏ కొందరికో పరిమితం కాకుండా వాస్తవ సాగుదార్లకు అందుతున్నాయంటే దానికి కారణం ఎలక్ట్రానిక్‌ పంట నమోదే. ఆయా గ్రామ పరిధిలోని అన్నదాతలు తాము సాగు చేసే పంటను గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా నమోదు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి లబ్ధీ పొందుతున్నారు. ఆర్బీకేలు రైతుకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలుగా పని చేస్తున్నాయనడంలో సందేహమే లేదని రైతు సంఘాల నాయకులే చెప్పడం విశేషం. 

సేవలపై సర్వత్రా సంతృప్తి..
పంటల బీమా మొదలు ఉత్పత్తుల విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాలలో అందుతున్న సేవలపై రైతులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూ రికార్డుల్లో తప్పులుంటే తప్ప నిర్దేశించిన ప్రతిదీ సమయానికి అందుతోంది. రైతుకు ఏదన్నా జరిగితే చెప్పుకోవడానికి ఇప్పుడో కేంద్రం ఉందన్న భరోసా ఉంది. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. మూగ జీవాలు చచ్చిపోతే వాటి బీమా కోసం కాలి గిట్టల్నో, చెవి పోగులను గోతాల్లో వేసుకుని పోవాల్సి వచ్చేది, ఈవేళ ఆర్బీకేకి వెళ్లి పశుసంవర్ధక శాఖ సహాయకునికి చెబితే సరిపోతుందని అనంతపురం జిల్లాకు చెందిన వెంకటయ్య అభిప్రాయపడ్డారు. నాసిరకం ఉత్పత్తుల్ని రైతులకు అంటగట్టేందుకు ప్రైవేటు డీలర్లు భయపడుతున్నారంటే ఆర్బీకేల వల్లేనని రైతు నాయకుడు వంగల భరత్‌ రెడ్డి చెప్పారు. 

కనీస మద్దతు ధర కల్పించడంలో కీలక పాత్ర
పండించిన ప్రతి పంటకూ గిట్టుబాటు ధర కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభిలాషకు నిలువెత్తు నిదర్శనం ఆర్బీకేలు. ఇవి సీఎం మానసపుత్రికలు. ధాన్యం, మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాలు, అపరాలు, నూనె గింజలు, ఇతర వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధరలు తగ్గినప్పుడు మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌కు కూడా ఆర్బీకేలు తోడ్పడుతున్నాయి. ఆర్బీకేలు ఉండబట్టే ప్రైవేటు వ్యాపారుల ఆగడాలు ఆగాయి. త్వరలో గిడ్డంగులు కూడా వస్తాయి. అవి వస్తే రైతులకు ఇంకా మేలు జరుగుతుంది. 
– హెచ్‌.అరుణ్‌ కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్‌

ఆర్బీకేల ప్రయోగం దేశానికే ఆదర్శం.. 
ఆర్బీకేలు వచ్చిన తర్వాత విత్తనాల కోసం క్యూలు లేవు. ధరల్లో తేడాలు లేవు. ఎంఎస్‌పీ ప్రకారం కొనకపోతే ఫిర్యాదు చేసే వ్యవస్థ ఒకటి ఈవేళ ఏర్పాటైంది. రూ.2,281.8 కోట్లతో ఆర్బీకేలకు భవనాలు, ఇతర మౌలిక వసతులు సమకూరుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికీ ఒక వ్యవస్థ ఏర్పాటవుతుంది. పారదర్శకత, జవాబుదారీ తనం పెరుగుతుంది. 
– కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి

రైతుకు తలలో నాలుకలా ఆర్బీకేలు
రాష్ట్రంలో వినూత్నంగా అమలవుతున్న ఆర్బీకేలను ప్రత్యక్షంగా చూశా. రైతులకు తలలో నాలుకలా ఉన్నాయి. సమగ్ర రైతు సేవలకు ఇవి సాక్షాత్తు కేంద్రాలు. ఆర్బీకేలను గ్రామీణ సహకార సంఘాలతో అనుసంధానం చేసే ఆలోచన చేస్తున్నాం. రైతుల సాధికారతలో గ్రామీణ పరపతి సంఘాలను ఆర్బీకేలతో అనుసంధానం చేస్తే అద్భుత ఫలితాలు రావొచ్చునని భావిస్తున్నాం.  
– డాక్టర్‌ జీఆర్‌ చింతల, నాబార్డ్‌ చైర్మన్‌

జీవితానికి ‘భరోసా’ దొరికింది
ఎప్పట్నుంచో ఇక్కడి పోడు భూముల్లో కాఫీ పంట సాగు చేస్తున్నా. వైఎస్సార్‌ తర్వాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. మళ్లీ జగనన్న సీఎం అయిన తర్వాతే మాకు పట్టాలు వచ్చాయి. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద డబ్బులు కూడా ఇచ్చారు. ఈ సొమ్మును పొలం పనులకు వాడుతున్నా. ఎవరూ పట్టించుకోని మాకు పట్టాలిచి్చ.. రైతు భరోసా అమలు చేసిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.  
– కొర్రా వరహాలమ్మ, మోదాపల్లి, విశాఖ జిల్లా  

వైఎస్సార్‌ రైతు భరోసా
ఇచ్చిన మాట కంటే ఎక్కువగా.. చెప్పిన దాని కంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల కోసం వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి అమలుచేస్తోంది. మూడు విడతల్లో కలిపి రూ.13,500 అందిస్తోంది. అలాగే భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులతో పాటు పోడు భూముల సాగుదారులకు కూడా రైతు భరోసా ఇస్తోంది. తొలి ఏడాది 1,58,123 మంది కౌలుదారులు, పోడు భూముల సాగుదారులకు లబ్ధి చేకూరగా.. గతేడాది 1,54,171 మందికి పెట్టుబడి సాయం అందింది. ఈ ఏడాది 1,86,254 మందికి రైతు భరోసా లభించింది.  

వడ్డీల భారాన్ని దించేశారు..
నాకు 3.46 ఎకరాల పొలముంది. సాగు కోసమని కమలాపురం డీసీసీబీలో దాదాపు రూ.90 వేల వరకు రుణం తీసుకున్నా.దీనికి సంబంధించిన వడ్డీని బ్యాంకుకు సకాలంలో చెల్లించేవాడిని. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్‌.. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకంతో ఆదుకున్నారు. ఇప్పుడు నాకు వడ్డీ భారం కూడా తొలగిపోయింది. రైతు భరోసా కూడా వస్తోంది. జగన్‌ సీఎం అయ్యాక నా లాంటి రైతుల పరిస్థితి బాగుపడింది. 
– వి.కృష్ణారెడ్డి, అగస్త లింగాయపల్లె, వైఎస్సార్‌ జిల్లా 

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు
రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు’ పథకాన్ని సీఎం జగన్‌ తీసుకొచ్చారు. రూ.లక్ష వరకు పంట రుణాలు తీసుకొని ఏడాది లోపు దాన్ని తిరిగి చెల్లించిన రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో రైతులకు రూ.1,202.61 కోట్ల వడ్డీ రాయితీ అందజేసింది. 2019(ఖరీఫ్‌)లో అర్హులైన 14,26,994 మందికి రూ.289.42 కోట్లు.. 2019–20(రబీ)లో అర్హులైన 6,27,906 మందికి రూ.128.47 కోట్లు జమ చేసింది. టీడీపీ ప్రభుత్వ బకాయిలనూ చెల్లిస్తోంది. 

సమయానికి ఆదుకున్నారు
మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాను. గతేడాది కురిసిన వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయా. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న నన్ను సీఎం జగన్‌.. సమయానికి ఆదుకున్నారు. అదే ఏడాది నవంబర్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ ప్రకటించారు. ఎకరాకు రూ.6 వేలు చొప్పున మొత్తం రూ.18,000 నా ఖాతాలో జమ చేశారు. నిజంగా ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం.   – బి. సత్యనారాయణరాజు, రైతు, గంటి గ్రామం, తూర్పుగోదావరి జిల్లా

రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ
విపత్తుల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు దక్కాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ ఒకప్పుడు అందని ద్రాక్షగానే ఉండేది. కానీ జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. విపత్తు జరిగి నెల రోజులు కూడా తిరగక ముందే పంట నష్ట పరిహారం అందజేస్తోంది. గత రెండేళ్లుగా కరువు తీరా కురిసిన వర్షాల వల్ల వచ్చిన వరదలతో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. అతి తక్కువ సమయంలోనే ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించింది. దీని కోసం ప్రభుత్వం ప్రతి బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.2 వేల కోట్లు చొప్పున ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధిని ఏర్పాటు చేస్తోంది. 

సొంతంగా వ్యాపారం చేస్తున్నా
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నా భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఎవరి మీదా ఆధారపడకూడదని కూరగాయలమ్మడం మొదలుపెట్టా. చేతిలో డబ్బుల్లేక పెట్టుబడికి అప్పు చేయాల్సి వచ్చేది. వచ్చిన లాభం కాస్తా వడ్డీకే సరిపోయేది. ఇలాంటి పరిస్థితిలో వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా రూ.18,750 వచ్చాయి. వాటితో తోపుడు బండి కొనుక్కొని మచిలీపట్నం సెంటర్‌లో కూరగాయల వ్యాపారం చేస్తున్నా.   
– రసూల్‌ బీ, మచిలీపట్నం, కృష్ణా జిల్లా 

వైఎస్సార్‌ చేయూత 
మహిళా సాధికారతే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ‘వైఎస్సార్‌ చేయూత’ పథకాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా 45–60 ఏళ్ల వయసు మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున అందజేస్తున్నారు. నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సాయం చేయనున్నారు. తొలి ఏడాది 24.55 లక్షల మంది మహిళలకు రూ.4,604.13 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. 

ఇది పేదోళ్ల ప్రభుత్వం 
నేను కౌలు రైతును. కొడుకు, కోడలితో కలిసి వ్యవసాయ పనులు చేస్తుంటాం. ఇతరత్రా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఈ పరిస్థితిలో గత ఏడాది కరోనా కారణంగా బయటి పనులు లేవు. ఇల్లు గడిచేదెలా అని దిగులు చెందాం. ఇదే సమయంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పెద్ద మనసుతో తెల్ల కార్డు ఉన్న పేదలందరికీ కోవిడ్‌ సాయం ప్రకటించి ఆదుకుంది. ఎనిమిది నెలల పాటు ప్రతినెలా రెండు పర్యాయాల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేశారు. సీఎం కరోనా తొలి నెలలోనే వలంటీర్‌తో మా ఇంటికి రూ.1,000 పంపించి, ఖర్చుల కోసం ఎవరినీ చేయి చాచకుండా చేశారు. ప్రతి నెలా బియ్యంతో పాటు శనగలు లేదా కందిపప్పు ఇచ్చారు. చివరి విడతలో గోధుమలు కూడా ఇచ్చారు. గతేడాది నవంబర్‌లో నా కోడలు కవితకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తే ఆపరేష¯Œన్‌ చేయాలని, రూ.2.50 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉండటంతో ఒక్క రూపాయి తీసుకోకుండా చికిత్స చేశారు. ఇతరత్రా ప్రభుత్వ పథకాలతో మా కుటుంబానికి లబ్ధి కలిగింది.   
– గోళ్లమూడి భూషణం, తురుమెళ్ల, అమతలూరు మండలం, గుంటూరు జిల్లా 

పేదలకు ఆహార భద్రత 
కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్‌ డౌన్‌ విధించిన సమయంలో నిరుపేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున రూ.1,350.53 కోట్లను నగదు సాయంగా పంపిణీ చేసింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న సమయంలో గతేడాది ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు అదనంగా రెండోసారి రేషన్‌ను పంపిణీ చేసింది. ఇందుకు రూ.3,103 కోట్లను అదనంగా వెచ్చించింది. ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో సాధారణంగా కుటుంబంలో ఒక్కొక్కరికి ఐదు కేజీల చొప్పున ఇచ్చే బియ్యంతోపాటు అదనంగా ఐదు కేజీల బియ్యాన్ని ఒకే విడతలో పంపిణీ చేస్తోంది. ఇందుకు రూ.754 కోట్లను అదనంగా వ్యయం చేస్తోంది. నిరుపేదలకు ఆహారభద్రత చేకూర్చడాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా చేపట్టింది. దేశంలో ఎక్కడా లేని రీతిలో పౌరసరఫరాల శాఖ నేతృత్వంలో 1.47 కోట్ల నిరుపేదల కుటుంబాలకు 9,260 వాహనాల ద్వారా నాణ్యమైన బియ్యంతోపాటు చక్కెర, కందిపప్పు వంటి నిత్యావసరాలను పంపిణీ చేస్తోంది.    

తోబుట్టువులా తోడుంటున్నారు
మా సంఘంలో పది మంది ఉన్నారు. పిల్లల చదువుల కోసమని, చిన్నచిన్న వ్యాపారాల కోసమని రుణాలు తీసుకునేవాళ్లం. ఆ తర్వాత వడ్డీలతో కలిపి అసలు చెల్లించలేక ఇబ్బంది పడేవాళ్లం. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఈ సమస్య తొలగిపోయింది. వైఎస్సార్‌ సున్నా వడ్డీ ద్వారా మాకు మేలు చేస్తున్నారు. గతేడాది నాకు రూ.3,200 వడ్డీ రాయితీ వచి్చంది. ఈ ఏడాది మరో రూ.3 వేలు వచ్చాయి. ఒక కుటుంబ సభ్యుడిలా.. తోబుట్టువులా మమ్మల్ని సీఎం జగన్‌ ఆదుకుంటున్నారు. 
– గేదెల సరస్వతి, లక్ష్మీపురం, శ్రీకాకుళం.

వైఎస్సార్‌ సున్నా వడ్డీ (స్వయం సహాయక సంఘాలు)
స్వయం సహాయక సంఘాల మహిళల కుటుంబాల్లో సంతోషం నింపేందుకు సీఎం జగన్‌ ఇచి్చన మాట ప్రకారం.. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తోంది. 7,81,485 పొదుపు సంఘాలు తీసుకున్న రుణాలపై 2019–2020కి సంబంధించిన వడ్డీ డబ్బులు రూ.1,257.99 కోట్ల మొత్తాన్ని గతేడాది ఏప్రిల్‌లో చెల్లించింది. 2020–21కి సంబంధించిన వడ్డీ రూ.1,096.23 కోట్లను ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. 

ఇలాంటి సీఎంను ఇప్పటివరకు చూడలేదు.. 
సొంతంగా అర ఎకరా ఉంది. మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా. గతేడాది వర్షాల వల్ల కోతకు వచ్చిన పైరు దెబ్బతింది. ప్రభుత్వమే ప్రీమియం కట్టి బీమా వచ్చేలా చూసింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా రైతులను ఆదుకోలేదు. కానీ జగన్‌ ప్రభుత్వం.. వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి సంబంధించి నా బ్యాంక్‌ ఖాతాలో డబ్బులు జమ చేసింది.  
– తెలమేకల శ్రీనివాసులు, అన్నారెడ్డిపాళెం, నెల్లూరు జిల్లా 

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా 
రైతులు తాము పండించిన పంటలకు బీమా చేయించుకోలేక.. విపత్తుల బారిన పడిన ప్రతిసారీ ఆరి్థకంగా నష్టపోయేవాళ్లు. ఈ పరిస్థితికి సీఎం జగన్‌ చెక్‌ పెట్టారు. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం ద్వారా నష్టపోయిన మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. పైగా టీడీపీ హయాంలోని రూ.715.84 కోట్ల బకాయిలనూ సీఎం జగన్‌ చెల్లించారు.  

మరిన్ని వార్తలు