గర్భిణులకు దన్నుగా 108

6 Nov, 2021 05:30 IST|Sakshi

పద్నాలుగు నెలల్లో 2.34 లక్షల మందికి ఆపన్న హస్తం

కోవిడ్‌ బాధితుల తర్వాత ఎక్కువమంది లబ్ధిదారులు వీరే

మొత్తం సేవలు పొందిన వారిలో 54 శాతం మంది పురుషులు.. 46 శాతం మంది మహిళలు

ఆక్సిజన్‌ సాయంతో 6.62 లక్షల మంది ఆస్పత్రులకు..

1.10 లక్షల మంది గోల్డెన్‌ అవర్‌లో తరలింపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 108 అంబులెన్సుల ద్వారా సేవలు పొందుతున్న వారి సంఖ్య  పెరిగింది. గతంలో 1.19 లక్షల మందికి ఒక అంబులెన్సు ఉంటే.. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక 2020 జులై నుంచి ప్రతి 74,609 మందికీ ఒక అంబులెన్సు నడుస్తోంది. దీంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2020 జులై నుంచి 2021 ఆగస్టు వరకూ అంటే 14 నెలల్లో 10.77 లక్షల మంది ‘108’ ద్వారా లబ్ధిపొందారు. వీరిలో కోవిడ్‌ బాధితులు, గర్భిణులే ఎక్కువ మంది ఉన్నారు. కొత్త అంబులెన్సులు రాకమునుపు ఏడాదికి సగటున 6.33 లక్షల ఎమర్జెన్సీ సర్వీసులు నమోదు కాగా, ఇప్పుడా సంఖ్య 10.77 లక్షలకు పెరిగింది. వీరిలో 54 శాతం మంది పురుషులు కాగా, 46 శాతం మంది మహిళలున్నారు. అలాగే, 1.10 లక్షల మందికి పైగా రోడ్డు ప్రమాద బాధితులు అంబులెన్సుల్లో ఆస్పత్రులకు వెళ్లారు.

6.62 లక్షల మందికి ఆక్సిజన్‌ 
ఇక 108 అంబులెన్సులో వెళ్తున్నారంటేనే ఆక్సిజన్‌ అవసరం ఎక్కువగా ఉంటుందని ఒక భావన. అలా గడిచిన 14 నెలల్లో  6.62 లక్షల మంది ఆక్సిజన్‌ సాయంతో ఆస్పత్రికి వెళ్లారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 72 వేల మందికి పైగా ఈ సౌకర్యం పొందారు. అనంతపురం జిల్లాలో 67 వేల మందికి పైగా ఆక్సిజన్‌ సాయంతో ‘108’లో ఆస్పత్రులకు వెళ్లారు.

లబ్ధిదారుల్లో గర్భిణులే ఎక్కువ
మొత్తం 10.77 లక్షల మంది లబ్ధిదారుల్లో ఎక్కువగా 30 ఏళ్లలోపు వారు ఎక్కువగా ఉన్నారు. 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు మహిళలకు బిడ్డలు కనే వయసు కాబట్టి ఎక్కువమంది గర్భిణులు 108 వాహనాలను వినియోగించుకున్నారు. ఒక్క 21 నుంచి 30 ఏళ్లలోపు కేటగిరీలోనే 2.43 లక్షల మంది మహిళలు ‘108’లో వచ్చినట్లు వెల్లడైంది. అంబులెన్సుల్లో లబ్ధిపొందిన వారిలో 21.7 శాతం మంది అంటే 2.34 లక్షల మంది గర్భిణులే ఉన్నారు. అత్యధికంగా 22.4 శాతం మంది (2.41 లక్షలు) కోవిడ్‌ బాధితులున్నట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. అలాగే, 1.10 లక్షల మంది ప్రమాద బాధితులు, 32 వేల మందికి పైగా హృద్రోగులు, 63వేల మందికి పైగా పక్షవాతం బాధితులు తొలి గంటలోనే (గోల్డెన్‌ అవర్‌) ఆస్పత్రులకు వెళ్లగలిగారు. 

మరిన్ని వార్తలు