ప్రాణదాతలు.. 108 ఉద్యోగులు

2 Jan, 2023 08:39 IST|Sakshi
స్థానికుల సాయంతో స్ట్రెచర్‌పై లక్ష్మణను మోసుకొస్తున్న 108 సిబ్బంది

 సముద్రంలో నీట మునిగిన వ్యక్తికి 108లో చికిత్స

సకాలంలో స్పందించడంతో తప్పిన ప్రాణాపాయం

వాడపాలెం బీచ్‌లో ఘటన

రాంబిల్లి: సముద్ర కెరటాల ధాటికి నీటిలో మునిగి ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ వ్యక్తిని 108 అంబులెన్స్‌ సిబ్బంది రక్షించారు. వారు సకాలంలో స్పందించి ఆక్సిజన్‌ అందించడంతో బాధితుడి ప్రాణం నిలిచింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి శివారు వాడపాలెం బీచ్‌లో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. యలమంచిలికి చెందిన సీహెచ్‌ లక్ష్మణ (35), అతని నలుగురు స్నేహితులు శనివారం రాత్రి వాడపాలెం వచ్చారు. అక్కడ రాత్రంతా పార్టీ చేసుకున్నారు. ఉదయం బీచ్‌లో స్నానానికి దిగారు.

కెరటాల ధాటికి లక్ష్మణ కొట్టుకుపోతుండగా, పక్కనే ఉన్న స్నేహితులు అతికష్టం మీద ఒడ్డుకు చేర్చారు. అప్పటికే లక్ష్మణ స్పృహ కోల్పోగా... స్నేహితులు 108కు సమాచారం ఇచ్చారు. 108 వాహనం టెక్నీషియన్‌ యడ్ల అప్పలనాయుడు, పైలట్‌ ఎస్‌.చంద్రశేఖర్‌రాజు హుటాహుటిన బీచ్‌కు చేరుకున్నారు. బీచ్‌కు సుమారు కిలో మీటరు దూరంలో ఇసుక మాత్రమే ఉండటంతో వాహనం వెళ్లేందుకు సాధ్యం కాలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న లక్ష్మణను స్ట్రెచర్‌పై ఉంచి స్థానికుల సాయంతో 108 సిబ్బంది అంబులెన్స్‌ వద్దకు మోసుకొచ్చారు. వెంటనే అతనికి 108లో ఆక్సిజన్‌ పెట్టారు. సెలైన్‌ పెట్టి ఎక్కించి మందులు ఇచ్చారు. తర్వాత యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మణ కోలుకోవడంతో సాయంత్రం డిశ్చార్జ్‌ చేశారు. సకాలంలో స్పందించి కిలోమీటరు మేర స్ట్రెచర్‌పై లక్ష్మణను మోసి ఆక్సిజన్, వైద్య సేవలందించి ప్రాణం కాపాడిన 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు. 

మరిన్ని వార్తలు