ఆపద్బాంధవి 108

29 May, 2023 04:41 IST|Sakshi

వాహనం కూడా వెళ్లని అటవీప్రాంతంలో గర్భిణికి కాన్పు చేసిన సిబ్బంది 

మగబిడ్డకు జన్మనిచ్చిన వైనం.. తల్లీబిడ్డ క్షేమం 

చౌడేపల్లె: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైద్య స్వరూపమే మారిపోయింది. పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగానే 108 వ్యవస్థను మరింతగా బలోపేతం చేసింది. ఫోన్‌ వస్తే చాలు నిమిషాల్లో ఘటనా స్థలానికి సిబ్బంది చేరిపోతున్నారు. రోగులకు కావాల్సిన సహాయం అందించి మన్ననలు అందుకుంటున్నారు. ఇలాంటిదే చిత్తూరు జిల్లాలో జరిగింది.

చౌడేపల్లె మండలం, పందిళ్లపల్లె పంచాయతీ, ముదిరెడ్డిపల్లెకు చెందిన రాజశేఖర్, వసంత దంపతులు సోమల మండలం, పెద్ద ఉప్పరపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మామిడితోటలో కాపలా ఉన్నారు. ఇక్కడకు ఎలాంటి దారి వసతి లేదు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ కూడా అందదు. వసంత నిండు గర్భిణి కావడంతో ఆదివారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. రాజశేఖర్‌ సెల్‌ సిగ్నల్‌ ఉన్న ప్రాంతానికి వచ్చి 108కు ఫోన్‌ చేశారు.

సమాచారం అందుకొన్న 108 సిబ్బంది గణేష్, ప్రసాద్‌ అతికష్టం మీద మామిడి తోటకు చేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానికి కిలోమీటరు దూరం ఉండటంతో స్ట్రెచర్‌పైనే గర్భిణిని మోసుకువచ్చారు. మార్గమధ్యంలో పురిటి నొప్పులు అధికమవడంతో మామిడితోటలోనే సుఖ ప్రసవం చేశారు. వసంత మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను అటవీ ప్రాంతం నుంచి చౌడేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సిబ్బంది సేవలను గ్రామస్తులు, అధికారులు అభినందించారు. 

మరిన్ని వార్తలు