శానిటైజర్‌ తాగి 12 మంది మృతి

1 Aug, 2020 03:55 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒణిగల శ్రీనును పరామర్శిస్తున్న ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌

ప్రకాశం జిల్లా కురిచేడులో విషాదం

మృతులంతా యాచకులు, రిక్షా పుల్లర్లు, కూలీలే

మత్తు కోసం శానిటైజర్లు తాగుతున్న వైనం

గ్రామంలో మరో 30మందికి పైగా బానిసలు

ఘటనపై విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు/కురిచేడు: ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో పెనువిషాదం చోటుచేసుకుంది. శానిటైజర్‌ను సేవించిన 12 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఇద్దరు గురువారం రాత్రి.. మిగిలిన తొమ్మిది మంది శుక్రవారం మరణించారు. మృతులంతా యాచకులు, రిక్షా పుల్లర్లు, కూలీలే. జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన వివరాలివీ.. కురిచేడు మండల కేంద్రంలో కరోనా కేసులు పెరిగిపోవడంతో అధికారులు గత కొద్దిరోజులుగా లాక్‌డౌన్‌ విధించారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను మూసివేయించారు. దీంతో గత 14 రోజులుగా వీరంతా మద్యం దొరక్క శానిటైజర్లకు అలవాటుపడ్డారు. ఈ నేపథ్యంలో.. అనేకమంది చేతులు వణుకుతున్నాయంటూ ఇంట్లో వాళ్లకి నచ్చజెప్పి గురువారం శానిటైజర్‌ సేవించారు. దీంతో ఈ రెండ్రోజుల్లో మొత్తం కలిపి 12మంది బలయ్యారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని.. తాము అన్యాయమైపోయా మంటూ మృతుల కుటుంబ సభ్యులు చేస్తున్న ఆక్రందనలు కురిచేడులో మిన్నంటాయి.

మృతులంతా నిరుపేదలే
శానిటైజరు తాగి మృతిచెందిన బాధితులంతా నిరుపేదలే. గురువారం రాత్రి ఇద్దరు..శుక్రవారం మరో 9 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో కోటగిరి రమణయ్య (45), కడియం రమణయ్య (27), గుంటక రామిరెడ్డి (57), మాడుగుల చార్లెస్‌ (36), రాజారెడ్డి (65), అనుగొండ శ్రీను (30), భోగ్యం తిరుపతయ్య (35), పాలెపోగు దాసు (65), కుండా అగస్టీన్‌ (42), షేక్‌ సైదా (30), కనకాల బాబూరావు (49) ఉన్నారు. బొనిగల శ్రీను అనే మరో యువకుడు స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స పొందుతున్నాడు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ మృతుల కుటుంబాలను పరామర్శించి సానుభూతి వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్ణకరమన్నారు. ఘటనపై కురిచేడు వీఆర్వో సీహెచ్‌ వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రే పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

దర్యాప్తునకు ప్రత్యేక బృందం : ఎస్పీ
కాగా, జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ శుక్రవారం గ్రామంలోని మృతుల కుటుంబాలను పరామర్శించి వివరాలు సేకరించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు మార్కాపురం ఓఎస్‌డీ చౌడేశ్వరి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. వివిధ మెడికల్‌ షాపుల్లో అమ్ముతున్న శానిటైజర్లను సీజ్‌ చేయడంతో పాటు మృతులు తాగిపడేసిన సీసాలను సీజ్‌ చేసి కెమికల్‌ ఎనాలసిస్‌ కోసం ల్యాబ్‌కు పంపుతున్నామని చెప్పారు. రిపోర్టు అందిన తరువాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మద్యానికి అలవాటుపడ్డ వారు ఎలాంటి శానిటైజర్లు, మత్తు పదార్థాలను సేవించవద్దంటూ ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా దీనిపై ప్రత్యేక నిఘా ఉంచుతామని చెప్పారు. 

మూడు నెలలుగా శానిటైజర్లే
గ్రామంలో 30 మందికి పైగా మత్తు కోసం శానిటైజర్లు తాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరందరినీ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు గత మూడు నెలలుగా శానిటైజరు తీసుకుంటున్నట్లు అధికారులు స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. అలాగే, గ్రామంలో ఇంకా ఎంతమంది దీనికి అలవాటుపడ్డారనే దానిపై నిఘా పెట్టారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దొరక్క కొందరు.. మద్యం ధరలు అమాంతం పెరిగిపోవడంతో వాటిని కొని తాగలేక మరికొందరు శానిటైజర్లకు అలవాటుపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ వ్యాపారం కోసం కొందరు మెడికల్‌ షాపు నిర్వాహకులు వాటిని అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మృతుల్లో నలుగురికి కరోనా
శానిటైజర్‌ తాగి మృతిచెందిన వారిలో నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం సందర్భంగా పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. వారి కుటుంబసభ్యులకు శనివారం కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వైద్యాధికారులు సన్నద్ధమవుతున్నారు. 

మరిన్ని వార్తలు