డోలీలకు చెక్‌ పెట్టేలా ‘గిరి రక్షక్‌’

18 Nov, 2022 05:18 IST|Sakshi
బైక్‌ అంబులెన్స్‌

గిరిపుత్రుల ఆరోగ్య రక్షణకు 123 బైక్‌ అంబులెన్స్‌లు

సాక్షి, అమరావతి: మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు సుస్తీ చేస్తే దుప్పట్లతో డోలీ కట్టి కర్రలతో మోసుకుపోవడం.. మంచాలపై పడుకోబెట్టి ఆస్పత్రులకు తరలించే దుస్థితి తప్పనుంది. మారుమూల  గిరిజన బిడ్డలకు సైతం తక్షణ వైద్య సహాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ‘గిరి రక్షక్‌’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుడుతోంది. ఈ ప్రాజెక్ట్‌ కింద 123 బైక్‌ అంబులెన్స్‌లను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో 108, 104 అంబులెన్స్‌లతోపాటు 122 ఫీడర్‌ అంబులెన్స్‌ (మూడు చక్రాల బైక్‌)లు వైద్య సేవలు అందిస్తున్నాయి. మూడు చక్రాల ఫీడర్‌ అంబులెన్స్‌లు సైతం వెళ్లలేని ప్రాంతాలకు చేరుకునేలా బైక్‌ అబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చే కసరత్తు తుది దశకు చేరుకుంది. 

కాలిబాట ఉన్నా సరిపోతుంది
నాలుగు చక్రాల అంబులెన్స్‌లు వెళ్లాలంటే కనీసం 6 అడుగుల దారి, మూడు చక్రాల ఫీడర్‌ అంబులెన్స్‌లు వెళ్లాలంటే మూడు అడుగుల దారి తప్పనిసరి. అదే బైక్‌ అంబులెన్స్‌ అయితే అడుగు, అడుగున్నర మార్గం ఉంటే చాలు. దీంతో ఇది మారుమూల ప్రాంతాల గిరిజనులకు ఉపయోగపడుతుందని గిరిజన సంక్షేమ శాఖలోని వైద్య, ఆరోగ్య విభాగం అధికారులు చెబుతున్నారు.

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణలో కాకినాడ జేఎన్‌టీయూ రూపొందించిన బైక్‌ అంబులెన్స్‌ మోడల్‌ తరహాలో కొత్త బైక్‌ అంబులెన్స్‌లను అందుబాటులోకి తేనున్నారు. డ్రైవింగ్‌ సీటు వెనుక ఒక వ్యక్తి సౌకర్యంగా కూర్చునేలా 140 డిగ్రీల కోణంలో వాల్చిన తొట్టెలాంటి సీటు, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేలా ఆరకిలో ఆక్సిజన్‌ సిలిండర్, సెలైన్‌ బాటిల్‌ పెట్టుకునే ఏర్పాటుతోపాటు ప్రాథమిక చికిత్స(ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌) సామగ్రి ఉండేలా డిజైన్‌ చేయడం విశేషం.

ప్రత్యేక యాప్‌తో పర్యవేక్షించేలా..
బైక్‌ అంబులెన్స్‌లను పర్యవేక్షించేలా ప్రత్యేక యాప్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. అటవీ ప్రాంతంలో వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేని 1,818 ప్రాంతాలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ కారణంగా ఆ ప్రాంతాల వాసులు ఎవరికైనా ప్రాణాపాయ స్థితి తలెత్తితే డోలీ, మంచాలపై మోసుకెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందిచేలా బైక్‌ అంబులెన్సులను అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం గిరిజన సంక్షేమ, ఆరోగ్య, విద్య, పోషకాహారం కార్యక్రమాన్ని అమలులోకి తేనున్నారు.

ప్రతి బైక్‌ అంబులెన్స్‌కు 15 మారుమూల గిరిజన ప్రాంతాల చొప్పున అప్పగించి.. అక్కడి ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన, వారి సంక్షేమం, విద్య, పోషకాహారం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ప్రధానంగా గర్భిణులను నెల రోజుల ముందుగానే బర్త్‌ వెయిటింగ్‌ రూమ్‌లకు తరలిస్తారు. ఇందుకోసం రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 45 బర్త్‌ వెయిటింగ్‌ రూమ్‌లకు అదనంగా 32 కొత్త వాటిని ఏర్పాటు చేసి మొత్తం 77కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా శిశు మరణాలు, డోలీ మరణాలు పూర్తిగా నిర్మూలించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. 

మరిన్ని వార్తలు