పీజీ స్కాలర్లకు నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్‌

11 Oct, 2021 04:27 IST|Sakshi

24 నెలలపాటు పంపిణీ ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యార్థులకు ఏఐసీటీఈ శుభవార్త

జనవరి 15 వరకు దరఖాస్తు గడువు

గేట్, జీపాట్, సీడ్‌లలో ఉత్తీర్ణులై ఉండాలి

కోవిడ్‌తో తల్లిదండ్రులు మరణించిన విద్యార్థులకు ఏడాదికి 50 వేల స్కాలర్‌షిప్‌ 

డిగ్రీ, డిప్లమో విద్యార్థులు 2 వేలమందికి 4 ఏళ్లపాటు పంపిణీ

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్‌ సహా ప్రొఫెషనల్‌ కోర్సుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ) చదువుతున్న విద్యార్థులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శుభవార్త తెలిపింది. ఏఐసీటీఈ అనుమతితో నడిచే ప్రొఫెషనల్‌ కాలేజీల్లో ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో పీజీ చదివేవారిలో అర్హులైన వారికి నెలకు రూ.12400 చొప్పున స్కాలర్‌షిప్‌ను ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈమేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఏఐసీటీఈ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. విద్యార్థులు ‘పీజీఎస్‌సీహెచ్‌ఓఎల్‌ఏఆర్‌ఎస్‌హెచ్‌ఐపీ.ఏఐసీటీఈఐఎన్‌డీఐఏ.ఓఆర్‌జీ’లో ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించాలని పేర్కొంది. అభ్యర్థులు డిసెంబర్‌ 31లోగా ఈ పోర్టల్‌ ద్వారా లాగిన్‌ ఐడీని క్రియేట్‌ చేసుకుని వచ్చే జనవరి 15 లోపల దరఖాస్తును సమర్పించాల్సి ఉంది.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,400 చొప్పున ‘ఏఐసీటీఈ పీజీస్కాలర్‌షిప్‌’ కింద వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన వారు వారానికి 8 నుంచి 10 గంటలు వారి విద్యాసంస్థ సూచించిన మేరకు టీచింగ్, రీసెర్చి ప్రక్రియల్లో పాల్గొనాలి. అభ్యర్థుల నెలవారీ పెర్ఫార్మెన్స్‌ను పరిగణనలోకి తీసుకుని ఏఐసీటీఈ, విద్యాసంస్థ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా మంచి పురోగతిలో ఉంటేనే ఉపకార వేతనం కొనసాగిస్తారు. దరఖాస్తుదారులు గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌), గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్టు (జీపాట్‌), కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ డిజైన్‌ (సీడ్‌)లలో నిర్ణీత స్కోరు సాధించి ఉండాలి. మాస్టర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్, మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్, మాస్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొంది ఉండాలి. ఆయా విద్యాసంస్థలలోని ఇన్‌టేక్‌ను అనుసరించి స్కాలర్‌షిప్‌ల సంఖ్యను ఏఐసీటీఈ నిర్ణయిస్తుంది. వీటికి అదనంగా ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద పదిశాతం మందికి పీజీ స్కాలర్‌షిప్‌లను ఇస్తుంది. 24 నెలలు కొనసాగే ఈ ఉపకార వేతనానికి డ్యూయెల్‌ డిగ్రీ చదువుతున్నవారు కూడా అర్హులే. ఇతర వివరాలకు ఏఐసీటీఈ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. 

2 వేలమంది విద్యార్థులకు ‘స్వనాద్‌’
కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ‘స్వనాధ్‌’ పేరుతో ఆర్థికంగా తోడ్పాటు అందిస్తామని ఏఐసీటీఈ తెలిపింది. ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న కాలేజీల్లో డిగ్రీ, డిప్లమో చదివే వారిలో అర్హులైన 2 వేలమందికి ఏడాదికి రూ.50 వేల చొప్పున నాలుగేళ్ల పాటు స్కాలర్‌షిప్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాలేజీ ఫీజు, కంప్యూటర్, పుస్తకాలు, అవసరమైన పరికరాలు, మెటీరియల్‌ కోసం ఇచ్చే ఈ ఉపకార వేతనాల్లో వెయ్యి డిగ్రీ విద్యార్థులకు, వెయ్యి డిప్లమో విద్యార్థులకు కేటాయించారు. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన వారు, సాయుధ బలగాలు, పారామిలటరీలో పనిచేస్తూ చనిపోయిన వారి పిల్లలు దరఖాస్తు చేయడానికి అర్హులు. వారి కుటుంబ సంవత్సర ఆదాయం రూ.8 లక్షలకు మించరాదు. విద్యార్థులు ప్రభుత్వం నుంచి ఇతర సహాయం పొందుతున్నవారై ఉండరాదు. ఏఐసీటీఈ అనుమతి ఉన్న కాలేజీల్లో ప్రస్తుతం మొదటి సంవత్సరం డిగ్రీ, డిప్లమో చదువుతున్నవారై ఉండాలి. అభ్యర్థులు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ (ఎన్‌ఎస్‌పీ) ద్వారా నవంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. డిగ్రీ విద్యార్థులను ఇంటర్మీడియెట్‌ మార్కుల ఆధారంగా, డిప్లమో విద్యార్థులను టెన్త్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.  

మరిన్ని వార్తలు