సీఎం జగన్‌ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌.. ఆ నిర్మాణంలో ప్రత్యేకతలెన్నో..

31 Oct, 2022 10:56 IST|Sakshi

శరవేగంగా అంబేడ్కర్‌ విగ్రహ ప్రాజెక్టు పనులు

పురోగతిపై ప్రతివారం మంత్రులు, అధికారుల సమీక్ష

125 అడుగుల విగ్రహంలో ఇప్పటికే 40 శాతం తయారీ పూర్తి

జనవరి నెలాఖరుకు విజయవాడకు చేరనున్న విగ్రహం

విజయవాడ స్వరాజ్య మైదానంలో రాత్రి, పగలు శ్రమిస్తున్న 400 మంది

ఏప్రిల్‌ 14న విగ్రహావిష్కరణ

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహ ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజయవాడలోని స్వరాజ్య మైదానంలో 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పనులకు గతేడాది డిసెంబర్‌ 22న శ్రీకారం చుట్టారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. పనుల పురోగతిపై మంత్రుల కమిటీ, అధికారులు ప్రతివారం సమీక్షిస్తున్నారు. దీంతో అతి తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలో పనులు పూర్తికావచ్చాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతికి ఈ విగ్రహాన్ని ప్రారంభించేలా 400 మంది సిబ్బంది రాత్రి, పగలు శ్రమిస్తున్నారు. 

విగ్రహ నిర్మాణంలో ప్రత్యేకతలెన్నో..
గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలోని ఒక మారుమూల ప్రాంతంలో అంబేడ్కర్‌ స్మృతివనం ఏర్పాటు చేస్తామని హడావుడి చేసి ఆ ప్రాజెక్టును అటకెక్కించింది. వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన వెంటనే విజయవాడ నగర నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు 2020 జూలైలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందుకు కాంట్రాక్టు సంస్థను ఖరారు చేశారు. డిజైన్లు పూర్తి చేసి గతేడాది డిసెంబర్‌లో పనులు చేపట్టారు. దాదాపు వంద అడుగుల ఎత్తైన పీఠం(ఫెడస్టాల్‌)పై 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. దీంతో 225 అడుగుల ఎత్తుతో దేశంలో ఈ విగ్రహం కూడా ప్రత్యేకంగా నిలవనుంది. హరియాణాలోని నాథురామ్‌ ఆర్ట్స్‌ చేపట్టిన విగ్రహ తయారీ పనులను మంత్రుల కమిటీ ఇటీవల పరీశీలించింది. 125 అడుగుల విగ్రహాన్ని 1200 ముక్కలు (భాగాలు)గా తయారు చేసే పని దాదాపు 40 శాతం పూర్తి అయ్యింది. ఈ విగ్రహాన్ని జనవరి నెలాఖరు నాటికి విజయవాడకు తరలించనున్నారు.

అలాగే విగ్రహం ఏర్పాటుకు సపోర్టుగా ఉండేందుకు 125 అడుగుల ఎత్తైన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఫ్రేమ్‌ను హైదరాబాద్‌లోని నాచారంలో వేగంగా రూపొందిస్తున్నారు. 350 టన్నుల స్టీల్‌తో ఇది తయారవుతోంది. దీన్ని నవంబర్‌ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక విగ్రహం ఏర్పాటు కోసం విజయవాడలో చేపట్టిన మొదటి దశ పనులను జనవరి 18 నాటికి పూర్తి చేయనున్నారు. రెండో దశ పనుల్లో భాగంగా కన్వెన్షన్‌ సెంటర్, బేస్‌మెంట్‌ పార్కింగ్‌ జీ ప్లస్‌ 2, పరిసరాల అభివృద్ధి పనులను కూడా వేగంగా పూర్తి చేస్తామని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు.

మరిన్ని వార్తలు