ఆశాజనకంగా వంగ సాగు

14 Jun, 2022 23:54 IST|Sakshi
సాగులో ఉన్న వంగ పంట, వంకాయలను గ్రేడింగ్‌ చేస్తున్న కూలీలు

రైల్వేకోడూరు: ప్రస్తుతం రైతులు  ఆరుతడి, అంతర పంటలపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. నియోజకవర్గంలో వంగ పంటను సుమారు 130 ఎకరాలలో సాగుచేశారు. ఈ ఏడాది వంకాయలు కిలో రూ. 50 నుంచి రూ. 60 ధర పలకడంతో రైతులు ఆశాజనకంగా ఉన్నారు. ముఖ్యంగా రైతులు వంగ నారును అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, బాకరాపేట నర్సరీల నుంచి సేకరించి నారుమడులలో పెంచుతారు.

అనంతరం ఆధునిక వ్యవసాయ పద్ధతిలో దుక్కి దున్నిన పొలంలో వంగ నారుని నాటుతారు. సాధారణంగా ఎకరా  వంగ సాగుకు 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎకరాకు సుమారు 10 నుంచి 13 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అయితే గత ఏడాది వంగ కిలో 40 రూపాయలు ధర ఉండగా ప్రస్తుతం కిలో రూ. 50 నుంచి 60 రూపాయలు పలుకుతోంది. ఎకరానికి ఖర్చులు పోను రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తోందని రైతులు అంటున్నారు.   

ముఖ్యంగా వంగను ఎక్కువగా నల్లిపురుగు, బూడిదతెగులు, కాండం తొలుచు పురుగు, పచ్చ పురుగు అధికంగా ఆశిస్తాయి. వీటిని సకాలంలో క్రిమిసంహారక మందులు పిచికారీ చేసి పంటను కాపాడుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చని రైతులు తెలుపుతున్నారు. ఈ ప్రాంతంలో పండించిన వంగ పంటను రైల్వేకోడూరు మార్కెట్‌లోను, తిరుపతి మార్కెట్‌కు తరలిస్తుంటారు. ఈ ఏడాది వంగసాగు ఆశాజనకంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు