మౌలిక వసతుల కల్పనకు రూ.1,392 కోట్ల రుణం

23 Jan, 2022 04:07 IST|Sakshi

వైద్యారోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డ్‌ చేయూత.. నాబార్డు సీజీఎం సుధీర్‌కుమార్‌ జన్నావర్‌ వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగంలో చేపట్టిన మౌలిక వసతుల కల్పనకు నాబార్డు చేయూతనిచ్చింది. వైఎస్సార్, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో మూడు నూతన బోధనాస్పత్రుల నిర్మాణానికి, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని ఐటీడీఏ ప్రాంతాల్లో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి నాబార్డు రూ.1,392.23 కోట్ల రుణం మంజూరు చేసిందని నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సుధీర్‌కుమార్‌ జన్నావర్‌ వెల్లడించారు. నాబార్డు రూరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌ఐడీఎఫ్‌) కింద ఈ సాయం అందిస్తున్నట్టు తెలిపారు. 

► వైఎస్సార్, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏర్పాటు కానున్న మూడు బోధనాస్పత్రుల్లో మేజర్‌ ఆపరేషన్‌ థియేటర్, క్లినికల్‌ ఓపీడీలు, డయాలసిస్, బర్న్‌ వార్డు, క్యాజువాలిటీ వార్డు, స్పెషలైజ్డ్‌ క్లినికల్‌ కమ్‌ సర్జికల్‌ వార్డు, ఆక్సిజన్‌ ప్లాంట్‌.. వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని నాబార్డు సీజీఎం తెలిపారు. వైద్య విద్యకు సంబంధించి నాణ్యత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. 
► మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ కన్సల్టేషన్‌ రూమ్‌లు, ఆయుష్‌ క్లినిక్, ట్రీట్‌మెంట్‌ ప్రొసీజర్‌ రూమ్, డయాలసిస్‌ వార్డు, డయాగ్నస్టిక్‌ ల్యాబ్స్, ఓటీ కాంప్లెక్స్, ఓపీడీ, జనరల్, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్‌ వార్డులు తదితర సౌకర్యాలు అందుబాటులోకొస్తాయని చెప్పారు.  
► రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి నాబార్డు తగిన తోడ్పాటునందిస్తుందని ఆయన తెలిపారు. 
► రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు–నేడు కార్యక్రమానికి నాబార్డు ద్వారా 3 వేల 92 కోట్ల రూపాయల సాయం అందించామని, ఈ నిధులతో 25 వేల 648 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మాణం, మరుగు దొడ్లు, తాగునీటి సౌకర్యం వంటి వసతులు కల్పించినట్టు చెప్పారు. అలాగే అంగన్‌ వాడీ కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ఆక్వా ల్యాబ్స్‌ ఏర్పాటుకూ నాబార్డు సాయం అందించినట్టు సీజీఎం సుధీర్‌కుమార్‌ జన్నావర్‌ వివరించారు. 

మరిన్ని వార్తలు