పేదల ఇళ్లకు రాయితీపై 140 బస్తాల సిమెంట్‌

17 Apr, 2022 04:59 IST|Sakshi
బాధ్యతలు స్వీకరిస్తున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌

సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రస్తుతం రాయితీపై ఇస్తున్న 90 బస్తాల సిమెంట్‌ను ఇకపై 140 బస్తాలకు పెంచుతున్నట్లు గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ తెలిపారు. తద్వారా లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సచివాలయం 4వ బ్లాక్‌లో మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం విశాఖపట్నంలో లక్ష మంది మహిళలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు ఫైలుపై తొలి సంతకం చేశారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు 140 బస్తాల సిమెంట్‌ ఇచ్చే ఫైలుపై రెండో సంతకం చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మంత్రి రమేష్‌ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో లక్ష మంది మహిళలకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుంటే కొందరు అడ్డుపడ్డారన్నారు. నవరత్నాల్లో మేలిమి రత్నం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకమని కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొద్దిమందికే ఇళ్లు ఇచ్చారని.. నేడు కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంతృప్త స్థాయిలో ఇళ్లు మంజూరు చేశామన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సామాజిక న్యాయం చేస్తున్న విప్లవవాది, అభినవ పూలే, బీఆర్‌ అంబేడ్కర్‌కు అసలైన వారసుడు వైఎస్‌ జగన్‌ అని ఉద్ఘాటించారు. కాగా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డి. నాగేశ్వరరావు, రక్షణ నిధి, గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ భరత్‌గుప్త, జాయింట్‌ ఎండీ శివశంకర్‌ జోగి రమేష్‌కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.  

మరిన్ని వార్తలు