కడలి ఒడిలోకి

13 Aug, 2022 03:50 IST|Sakshi
విజయవాడ రైలు వంతెన అంచుల్లో కృష్ణా ప్రవాహం

గేట్లు దాటి దూకుతున్న కృష్ణా, గోదావరి 

శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌కు నేడూ భారీ ప్రవాహాలు 

భద్రాచలం వద్ద 52.1 అడుగుల్లో గోదావరి.. ఎగువన తగ్గుముఖం 

నేటి నుంచి ధవళేశ్వరంలో వరద తగ్గే అవకాశం 

గొట్టా బ్యారేజ్‌ నుంచి 14 వేల క్యూసెక్కుల వంశధార జలాలు సముద్రంలోకి  

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌:  విస్తారంగా కురుస్తున్న వర్షాలు.. పోటెత్తుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టులన్నీ నిండిపోయి గేట్లు ఎత్తి వేయడంతో కడలి వైపు నదులు పరుగులు పెడుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 4,28,120 (36.99 టీఎంసీలు) క్యూసెక్కుల కృష్ణా జలాలు, ధవళేశ్వరం బ్యారేజ్‌ నుంచి 14,76,919 (127.62 టీఎంసీలు) క్యూసెక్కుల గోదావరి జలాలు, గొట్టా బ్యారేజ్‌ నుంచి 14 వేల క్యూసెక్కుల (1.20 టీఎంసీలు) వంశధార జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. నాగార్జునసాగర్, భద్రాచలం దిగువన కృష్ణమ్మ,  గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రవాహాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.  ప్రకాశం బ్యారేజ్‌ వద్ద శుక్రవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
 
కృష్ణాలో స్థిరంగా వరద.. 
► జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 4,55,614 క్యూసెక్కులు చేరుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 14 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులను తరలిస్తున్నారు. కల్వకుర్తి ద్వారా 400 క్యూసెక్కులను తెలంగాణ తరలిస్తోంది. శ్రీశైలంలో పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,77,650 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి గట్టు కేంద్రం ద్వారా 26,825, ఎడమ గట్టు కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.6 అడుగుల్లో 213.40 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 
► శ్రీశైలం నుంచి వదులుతున్న జలాల్లో నాగార్జునసాగర్‌లోకి 4,11,932 క్యూసెక్కులు చేరుతుండగా కుడి కాలువకు 6,766, ఎడమ కాలువకు 7,937, ఏఎమ్మార్పీకి 2,400, వరద కాలువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్‌లో 24 గేట్లను పది అడుగులు, రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 3,61,602 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,927 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587 అడుగుల్లో 305.56 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. భారీ వరద నేపథ్యంలో సాగర్‌ టెయిల్‌పాండ్‌లో రెండు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. 
► నాగార్జునసాగర్‌ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 3,93,029 క్యూసెక్కులు చేరుతున్నాయి. 14 గేట్లను 3.5 అడుగుల మేర ఎత్తి 3,52,352 క్యూసెక్కులను, విద్యుదుత్పత్తి చేస్తూ 6 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతలలో 165.94 అడుగుల్లో 32.83 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 
► పులిచింతల నుంచి దిగువకు వస్తున్న నీటికి పాలేరు, మున్నేరు వరద తోడవుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 4,42,083 క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టా కాలువలకు 13,963 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 4,28,120 క్యూసెక్కులను బ్యారేజీ 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజీకి వరద నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద సమయంలో గతంలో దాదాపు 20 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాల్సి వచ్చేదని, కనకదుర్గ వారధి నుంచి దిగువకు కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం వల్ల ముంపు నుంచి రక్షణ కలిగిందని జిల్లా కలెక్టర్‌  ఢిల్లీరావు తెలిపారు. 
► ఎగువన కృష్ణా, తుంగభద్రలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి నుంచి 2.25 లక్షలు, నారాయణపూర్‌ నుంచి 2.33 లక్షలు, తుంగభద్ర డ్యామ్‌ నుంచి 88,896 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.  శనివారమూ శ్రీశైలంలోకి వరద ఇదే రీతిలో కొనసాగనుంది. 

వంశధార, నాగావళి పరవళ్లు.. 
ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళిలో వరద  కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 16,814 క్యూసెక్కుల వంశధార జలాలు చేరుతుండగా 2,814 క్యూసెక్కులను ఆయకట్టుకు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 14 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 3,600 క్యూసెక్కుల నాగావళి జలాలు చేరుతుండగా ఆయకట్టుకు 600 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 3 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.

వరద గోదారి.. 
కాళేశ్వరంలో అంతర్భాగమైన పార్వతి, సరస్వతి, లక్ష్మీ బ్యారేజ్‌లు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్, దుమ్ముగూడెం వద్ద ఉన్న సీతమ్మసాగర్‌లోకి వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో భద్రాచలం వద్ద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నీటి మట్టం 52.1 అడుగుల్లో ఉండగా రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టులోకి 12,17,365 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్‌ వేకు ఎగువన 34.13 మీటర్లు, దిగువన 25.72 మీటర్ల మేర వరద మట్టం నమోదైంది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,85,919 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 15 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 9 వేల క్యూసెక్కులను విడుదల చేస్తూ బ్యారేజ్‌ 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 14,76,919 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.  

మరిన్ని వార్తలు