కొట్టుకుపోయిన రైల్వే డబుల్‌ లైన్‌.. రూ.15 కోట్ల నష్టం 

21 Nov, 2021 03:22 IST|Sakshi
రైలు పట్టాలను పరిశీలిస్తున్న మాల్యా తదితరులు.

రాజంపేట/వేటపాలెం/తెనాలి రూరల్‌/రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ముంబై–చెన్నై రైలు మార్గంలోని వైఎస్సార్‌ జిల్లా నందలూరు సెక్షన్‌ పరిధిలో ఉన్న హస్తవరం డిస్టెంట్‌ సిగ్నల్‌ సమీపంలో కిలోమీటర్‌ మేరకు డబుల్‌ లైన్‌ వరదనీటి ఉధృతికి కొట్టుకుపోయింది. ఈ ఘటనతో రైల్వే శాఖకు రూ.15 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రైల్వే వర్గాల సమాచారం. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా శనివారం ఘటనాస్థలికి వెళ్లారు. వరదనీటి ఉధృతికి డబుల్‌ లైన్‌ ఎలా కొట్టుకుపోయిందన్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. కిలోమీటర్‌ మేర డబ్లింగ్‌ను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని ఆదేశించారు. దీంతో ఉదయం నుంచి రైల్వే అధికారులు, కార్మికులు డబుల్‌లైన్‌ అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టారు. ముందుగా ఎర్త్‌ వర్క్‌ను చేపట్టారు. రైల్వే విద్యుద్ధీకరణ పనులు చేపట్టారు. ఇంజనీరింగ్, ట్రాఫిక్, రైల్వే ఎలక్ట్రిఫికేషన్, సిగ్నల్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు మకాం వేసి 4 రోజుల్లోపు రైల్వే ట్రాక్‌ను అందుబాటులోకి తెచ్చే దిశగా పనులు వేగవంతం చేశారు.  
 దెబ్బతిన్న రైల్వేట్రాక్‌ 

పలు రైళ్లు రద్దు..ఆలస్యం 
వర్షాల కారణంగా నెల్లూరు జిల్లా పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్‌ వద్ద భారీగా వరద నీరు చేరింది. దీంతో రైల్వే అధికారులు ముందస్తు జాగ్రత్తగా పలు రైళ్లను ఎక్కడికక్కడ శనివారం మధ్యాహ్నం నుంచి నిలిపివేశారు. వేటపాలెం రైల్వేస్టేషన్‌కి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చిన హౌరా ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 6.30 వరకు స్టేషన్‌లో నిలిపివేశారు. చీరాల స్టేషన్‌లో 4 గంటల నుంచి కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుని నిలిపివేశారు. బాపట్ల స్టేషన్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ 3 గంటల పాటు నిలిపివేశారు. తెనాలి రైల్వేస్టేషన్‌లో హజరత్‌ నిజాముద్దీన్‌–చెన్నై సెంట్రల్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్, టాటానగర్‌–అలెప్పి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి. గూడూరు–విజయవాడ పాసింజర్, చెన్నై జనశతాబ్ది, గూడూరు ఇంటర్‌ సిటీ రైళ్లను రద్దు చేశారు. చెన్నై నవజీవన్, కొల్లాం–విశాఖ, తిరుపతి–పూరి రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.  

మరిన్ని వార్తలు