కరోనా కట్టడికి 15 రోజుల ప్రచార కార్యక్రమాలు

23 Mar, 2021 05:29 IST|Sakshi

ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర సర్కార్‌ 

వ్యాక్సినేషన్‌ ఆవశ్యకత, జాగ్రత్తలపై ప్రత్యేక దృష్టి

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌

సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కరోనా ప్రమాదం గురించి ప్రజలకు మరింతగా వివరించి చెప్పేలా 15 రోజుల పాటు పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. వాక్సినేషన్‌ ఆవశ్యకతతో పాటు కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ వివిధ ప్రభుత్వ శాఖలు పలు కార్యక్రమాలు చేపడతాయి. ఈ మేరకు ఈనెల 24 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు రోజువారీ ప్రచార కార్యాచరణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

24న కలెక్టర్లు తమ జిల్లా పరిధిలో అన్ని విభాగాల అధికారులతో కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై సమావేశాలు నిర్వహించాలి. వ్యాపార, వాణిజ్య సంఘాలను భాగస్వాములను చేయాలి. 25న పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో ర్యాలీలు, 26న మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తమ పరిధిలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై తనిఖీలు, 27న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీతో సహా ప్రజాప్రతినిధులందరినీ ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వామ్యులను చేస్తూ కార్యక్రమాలు, 28న సినిమా హాళ్లలో కరోనా నియంత్రణ చర్యలపై తనిఖీలు, 29న పాఠశాల విద్యార్థుల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులతో సమావేశాలు, 30న లారీ, టాక్సీ, ఆటో యజమానులతో సమావేశాలు, 31న పరిశ్రమల యజమానులతో జిల్లా కలెక్టర్లు సమావేశాలు, ఏప్రిల్‌ 1న ప్రయాణికుల వాహనాల్లో తనిఖీ, 2న షాపింగ్‌ మాల్స్, పరిశ్రమలలో చేపడుతున్న చర్యలపై తనిఖీలు, ఏప్రిల్‌ 3న గ్రామ వార్డు సచివాలయాల్లో అవగాహన కార్యక్రమాలు, ఏప్రిల్‌ 4న విద్యార్థులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానంలో వివిధ రకాల పోటీలు, 5న వివిధ మత సంస్థలలో కరోనా నియంత్రణ చర్యలపై తనిఖీలు, ఏప్రిల్‌ 6న సోషల్‌ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు, 7న జిల్లా, మండల, గ్రామ స్థాయిలో క్యాండిల్‌ ర్యాలీలు నిర్వహించాలని సీఎస్‌ ఉత్తర్వుల్లో ఆదేశించారు.   

మరిన్ని వార్తలు