ఎగుమతుల్లో 15 శాతం వృద్ధి 

21 Aug, 2022 05:15 IST|Sakshi

2021–22లో రూ.1.43 లక్షల కోట్లకు చేరిన రాష్ట్ర ఎగుమతులు

సత్ఫలితాలనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలు  

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి నమోదయ్యింది. 2020–21లో రూ.1,24,744.46 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఎగుమతుల విలువ 2021–22 నాటికి 15.31 శాతం పెరిగి రూ.1,43,843.19 కోట్లకు చేరుకుంది. 2030 నాటికి దేశ ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడమే కాకుండా.. అందుకు అనుగుణంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక సత్ఫలితాలను ఇస్తోంది. పరిశ్రమల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌(ఎగుమతులు) జీఎస్‌ రావు మాట్లాడుతూ.. ఎగుమతులను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ఎగుమతులు వేగంగా వృద్ధి చెందుతున్నాయని చెప్పారు.

ముఖ్యంగా ఆక్వా, ఫార్మా, రసాయనాలు, బియ్యం, ఉక్కు తదితర రంగాల్లో ఎగుమతుల వృద్ధికి మంచి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కొత్త జిల్లాల వారీగా ఎగుమతుల వృద్ధికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఎగుమతికి అవకాశమున్న ఉత్పత్తులను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం దీనిపై అధికారులు ఉత్పత్తుల సమాచారాన్ని సేకరిస్తున్నారని పేర్కొన్నారు. దీని తర్వాత తుది కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని చెప్పారు. జిల్లాల వారీగా ఉత్పత్తులను గుర్తించి.. వాటికి బ్రాండింగ్‌ కల్పిస్తామన్నారు. ఎగుమతుల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన చర్యలపై పరిశ్రమల శాఖ అధికారులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.    

మరిన్ని వార్తలు