గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.988 కోట్లు విడుదల

6 Feb, 2024 03:19 IST|Sakshi

15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం 

గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల ఖాతాల్లో జమ 

గ్రామ పంచాయతీలకే రూ. 689 కోట్లు 

మండల పరిషత్‌లకు రూ. 150.75 కోట్లు.. 

జిల్లా పరిషత్‌లకు రూ. 148.30 కోట్లు 

బిల్లులు చెల్లించే వెసులుబాటు సర్పంచులు,మండల, జిల్లా పరిషత్‌ అధికారులకు 

సాక్షి, అమరావతి: గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం రూ. 988 కోట్లను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని 13,097 గ్రామ పంచాయతీలకు రూ. 689 కోట్లు, 650 మండల పరిషత్‌లకు రూ. 148.30 కోట్లు, ఉమ్మడి 13 జిల్లా పరిషత్‌లకు రూ. 150.75 కోట్లను ఆయా పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల ఖాతాల్లో 15 రోజుల కిత్రమే జమ చేసినట్టు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు వెల్లడించారు. వీటికి తోడు గతంలో ఆయా స్థానిక సంస్థలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో ఖర్చు కాని మొత్తం రూ. 126.99 కోట్లు కలిపి.. ప్రస్తుతం గ్రామీణ స్థానిక సంస్థల వద్ద మొత్తం రూ. 1,115 కోట్లు అందుబాటులో ఉన్నట్టు అధికారులు వివరించారు.  

ఆన్‌లైన్‌లోనే బిల్లులు నమోదు.. నేరుగా సర్పంచులే డబ్బులు బదిలీ 
గ్రామ పంచాయతీలతోపాటు మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించే 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో ప్రభుత్వం ఇటీవల కీలక మార్పులు చేసింది. తాజాగా బిల్లుల చెల్లింపులు పీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో చేస్తారు. కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ నిబంధనల ప్రకారం పీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో.. ఏ పని చేపట్టినా వాటి బిల్లులు కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఆ బిల్లుల మొత్తాలను గ్రామ పంచాయతీలలో సర్పంచి, మండల, జిల్లా పరిషత్‌లలో అక్కడి మండల, జిల్లా స్థాయి అధికారులు నేరుగా పనిచేసిన వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయవచ్చు.

అయితే, చేసిన పనికి ఆన్‌లైన్‌లో బిల్లుల నమోదులో కట్టుదిట్టౖమైన ఏర్పాట్లు ఉన్నాయి. పని జరిగిన ప్రాంతం వివరాలు జియో ట్యాగింగ్‌తో సహా ముందుగానే ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేసి, ఎం–బుక్‌ వివరాలను కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి. ఆ పనులను ముందుగా గ్రామ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ), లేదంటే ఎంపీడీపీ లేదంటే జెడ్‌పీడీపీలో పేర్కొనాలి. ఈ ప్రణాళికలలో పేర్కొనని పనులకు ముందుగా ఆమోదం తీసుకోవాలి. ఆ పని చేసిన తర్వాత నిధులు డ్రా చేయడానికి అభివృద్ధి ప్రణాళికలో సప్లిమెంటరీ ప్లాన్‌లను తయారు చేసుకొని ఆ వివరాలను ఆ పోర్టల్‌ నమోదు చేసే వెసులుబాటు ఉందని పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు వెల్లడించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega