కోకిల డేగ.. ఉడతల గెద్ద!

28 Mar, 2021 04:44 IST|Sakshi

విజయవాడ పరిసరాల్లో 174 పక్షి జాతులు

వాటిలో 7 కొత్త జాతులు

సుదూరం నుంచి నాలుగు జాతుల రాక

ముగిసిన శీతాకాల పక్షుల గణన

20 ప్రాంతాల్లో 13,527 పక్షుల్ని పరిశీలించిన వలంటీర్లు

సాక్షి, అమరావతి: కోకిల డేగ.. ఉడతల గెద్ద.. నూనె బుడ్డిగాడు. సరదాగా ఆట పట్టించేందుకు గ్రామీణులు పెట్టిన పేర్లు కావివి. విజయవాడ పరిసరాల్లో సందడి చేస్తున్న కొత్త పక్షుల జాతులివి. ఈ ప్రాంతానికి కొత్తగా జిట్టంగి (బ్లైత్స్‌ పిపిట్‌), పెద్ద కంప జిట్ట (ఈస్టర్న్‌ ఓర్ఫియన్‌ వార్బ్‌లెర్‌), మెడను లింగాడు (యురోషియన్‌ వ్రైనెక్‌), కోకిల డేగ (క్రెస్టెడ్‌ గోషాక్‌), ఉడతల గెద్ద (పాలిడ్‌ హారియర్‌), నీలి ఈగ పిట్ట (వెర్డిటర్‌ ఫ్లైకాచర్‌), నూనె బుడ్డిగాడు (బ్లాక్‌ రెడ్‌స్టార్ట్‌) అనే 7 రకాల పక్షి జాతులు వస్తున్నట్టు పక్షి ప్రేమికులు గుర్తించారు. విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో మొత్తంగా 174 పక్షి జాతులు ఉన్నట్టు నిగ్గు తేల్చారు. మన రాష్ట్రంలో 460కి పైగా పక్షి జాతులు ఉండగా.. అందులో 174 అంటే 35 శాతం విజయవాడ పరిసరాల్లోనే ఉంటున్నట్టు గుర్తించారు. విజయవాడ నేచర్‌ క్లబ్‌ చేపట్టిన శీతాకాల పక్షుల గణనలో ఈ విషయాలు స్పష్టమయ్యాయి. డిసెంబర్‌ నుంచి మూడు నెలలపాటు 20 పెద్ద చెరువుల వద్ద 32 మంది వలంటీర్లు (డాక్టర్లు, వ్యాపారులు, విద్యార్థులు, బ్యాంక్‌ మేనేజర్లు తదితరులు) నిపుణులైన బర్డ్‌ వాచర్స్‌ సూచనల ప్రకారం గణన నిర్వహించిన గణనలో మొత్తం 13,527 పక్షుల్ని పరిశీలించారు.

జాతులెక్కువ.. సంఖ్య తక్కువ! 
ఈ గణన సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వలస వచ్చే నాలుగు పక్షి జాతుల్ని మాత్రమే గుర్తించారు. వాటిలో బాపన బాతు (రడ్డీ షెల్డ్‌ డక్‌), నామం బాతు (స్పాటెడ్‌ యురేషియన్‌ వైజన్‌), సూదితోక బాతు (నార్తర్న్‌ పిన్‌టైల్‌), చెంచామూతి బాతు (నార్తర్న్‌ షోవెలర్‌) ఉన్నాయని తెలిపారు. గతంలో ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పక్షులు వలస వచ్చేవి. ప్రస్తుతం వాటి సంఖ్య తగ్గిపోయినట్టు ఈ గణనలో స్పష్టమైంది. నున్న, కవులూరు, వెలగలేరు, కొత్తూరు తాడేపల్లి, ఈడుపుగల్లు, కొండపావులూరు గ్రామాల సమీపంలో చెరువులు, చిత్తడి నేలలు బాగున్నట్టు గుర్తించారు. ఎక్కువ పక్షి జాతుల్ని ఈ చెరువుల వద్దే లెక్కించారు. ఇక్కడికి వస్తున్న పక్షి జాతుల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. పక్షుల సంఖ్య మాత్రం బాగా తక్కువగా ఉన్నట్టు గణనలో తేలింది.

నీటి కాలుష్యం, చేపల చెరువులు ఎక్కువ కావడం, నివాస ప్రాంతాలు విస్తరించడం, పంట పొలాల్లో పురుగు మందుల వినియోగం పెరగడం వల్ల వలస పక్షుల సంఖ్య తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు. విజయవాడ పరిసరాల్లో పట్టణీకరణ ఎక్కువగా జరుగుతుండటం వల్ల చిత్తడి నేతలు, పంట పొలాలు నివాస ప్రాంతాలుగా మారిపోతున్నాయి. పక్షుల గణన నిర్వహించిన ఎక్కువ ప్రాంతాలు మానవ నివాసాలకు బాగా దగ్గర ఉన్నాయి. కొన్ని చెరువులు తమ సహజ స్వభావాన్ని కోల్పోగా కొన్ని బహిరంగ మలమూత్రాలు విసర్జించే ప్రాంతాలుగా మారాయి. రెండుచోట్ల పక్షుల్ని వేటాడటానికి పన్నిన వలల్ని గుర్తించారు. ఏదేమైనా పక్షుల సంఖ్య తగ్గడానికి చెరువుల చుట్టుపక్కల పొలాల్లో పురుగు మందుల వాడకం ఎక్కువగా ఉండటమేనని అంచనా వేస్తున్నారు. కొత్త జాతులు కనబడుతున్న నేపథ్యంలో పక్షుల జీవ వైవిధ్యం ఈ ప్రాంతంలో బాగానే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

బర్డ్‌ వాచింగ్‌ కమ్యూనిటీలు ఏర్పడాలి
విజయవాడలో బర్డ్‌ వాచింగ్‌ కమ్యూనిటీ లేకపోవడం వల్ల పక్షి జాతులను నమోదు చేయడం, పర్యవేక్షించడం, వాటి సంఖ్య అంచనా వేయడం పూర్తిస్థాయిలో సాధ్యం కావడం లేదు. బెంగళూరు, హైదరాబాద్, పుణే వంటి పెద్ద నగరాల్లో బర్డ్‌ వాచింగ్‌ కమ్యూనిటీలు ఎప్పటి నుంచో ఉండటం వల్ల అక్కడ బర్డ్‌ రేస్, బ్యాక్‌యార్డ్‌ బర్డ్‌ కౌంట్‌ వంటి వార్షిక కార్యక్రమాలు తరచూ జరుగుతున్నాయి. విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో అలాంటి కమ్యూనిటీలు ముందుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిర్వహించిన శీతాకాల పక్షుల గణనను ఇకపై వార్షిక కార్యక్రమంగా చేపడతాం. 
– బండి రాజశేఖర్, ఐఐఎస్‌ఈఆర్‌ సిటిజన్‌ సైన్స్‌ కో–ఆర్డినేటర్‌ 

మరిన్ని వార్తలు