181 మంది ఎస్‌ఐలకు సీఐలుగా పదోన్నతి

29 May, 2021 04:34 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పదోన్నతి పొందిన వారి హర్షం

రేంజ్‌ల వారీగా జాబితాలు విడుదల చేసిన డీజీపీ సవాంగ్‌

సాక్షి, అమరావతి:  పదోన్నతుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఎస్‌ఐల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఏకంగా రాష్ట్రంలోని 181 మంది ఎస్‌ఐలకు సీఐలుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ శుక్రవారం రేంజ్‌ల వారీగా పదోన్నతుల జాబితాలను ఆయా రేంజ్‌ పోలీస్‌ అధికారులకు పంపించారు. 2009 ఎస్‌ఐ బ్యాచ్‌కు చెందిన 181 మందికి సీఐలుగా పదోన్నతులు కల్పించారు. వారిలో విశాఖపట్నం రేంజ్‌ పరిధిలో 31 మంది, ఏలూరు రేంజ్‌ పరిధిలో 58 మంది, గుంటూరు రేంజ్‌లో 33 మంది, అనంతపురం, కర్నూలు రేంజ్‌లో 59 మంది ఉన్నారు. పోలీస్‌ శాఖలో దాదాపు 37 ఏళ్లకు పైగా సేవలు అందిస్తున్న అనేక మంది ఈ నెలాఖరున రిటైర్‌ అవుతున్నవారు ఉన్నారు. వారంతా పదోన్నతులు లేక ఎస్‌ఐలుగానే రిటైర్‌ అయిపోతామా? అని ఆవేదన చెందుతున్న తరుణంలో సీఐలుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. దీంతో ఈ నెలాఖరున రిటైర్‌ అవుతున్న పలువురు త్రీస్టార్‌ (సీఐ) అన్పించుకుని రిటైర్‌ అవుతామంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం జగన్‌ సార్‌కు రుణపడి ఉంటాను
కానిస్టేబుల్‌గా పోలీస్‌ శాఖలో విధులు చేపట్టిన నేను 38 ఏళ్లుగా పోలీస్‌ శాఖలో అనేక బాధ్యతలు నిర్వహించాను. 2009లో ఎస్‌ఐగా పదోన్నతి పొందాను. 1998లో విజయనగరం జిల్లా కొమరాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కొప్పడంగి, ఎల్విన్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గొట్లబద్ర గ్రామాల్లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లకు ముందు కీలకమైన మావోయిస్టుల సమాచారం అందించినందుకు నాకు నగదు అవార్డులు దక్కాయి. ఇలా అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించిన నేను ఎస్‌ఐగానే ఈ నెలాఖరున రిటైర్‌ అయిపోతానా? అని బాధపడుతున్న తరుణంలో సీఎం వైఎస్‌ జగన్, డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ పెద్ద మనసుతో సీఐగా పదోన్నతి ఇవ్వడం సంతోషకరం. వారికి రుణపడి ఉంటాను.  
– బొద్దాని రమణయ్య, విజయనగరం స్పెషల్‌ బ్రాంచ్‌

ప్రభుత్వ మేలు మరువలేను
కానిస్టేబుల్‌గా 1984లో బాధ్యతలు చేపట్టిన నేను 2009లో ఎస్‌ఐగా పదోన్నతి పొందాను. నాలుగేళ్లుగా సీఐ పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నాను. 2001 జూన్‌ 21న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్‌ స్టేషన్‌పై దాదాపు వంద మంది మావోయిస్టులు దాడి చేస్తే స్టేషన్‌ ఇన్‌చార్జి (హెడ్‌ కానిస్టేబుల్‌)గా ఉన్న నేను కేవలం ఇద్దరు ఏపీఎస్‌పీ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్ల సాయంతో తిప్పి కొట్టాను. అప్పటి డీజీపీ హెచ్‌జే దొర నగదు రివార్డు కూడా ఇచ్చారు. 2003లో మహారాష్ట్రకు చెందిన అతి క్రూరమైన భావారియా గ్యాంగ్‌ పందిళ్లపల్లిలో ఎదురుపడితే ఫైరింగ్‌ ఓపెన్‌ చేసి ఎదుర్కొన్నాను. విధి నిర్వహణలో 37 ఏళ్లపాటు ధైర్యంగా ఇన్ని సేవలు చేసిన నేను ఈ నెల 31న ఎస్‌ఐగానే పదవీ విరమణ చేయాల్సి వస్తుందని బాధపడ్డాను. కానీ, నాకు ఈ సమయంలో పదోన్నతి కల్పించిన ప్రభుత్వం మేలు జీవితాంతం మరువలేను. సీఎం వైఎస్‌ జగన్, డీజీపీ సవాంగ్‌లకు నా కృతజ్ఞతలు.
– పులి భావన్నారాయణ, ప్రకాశం జిల్లా 

>
మరిన్ని వార్తలు