మెమో విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ 

24 Jun, 2022 04:50 IST|Sakshi

సాక్షి, అమరావతి: 1998 డీఎస్సీలో పోస్టుల ఎంపికకు అర్హత సాధించినప్పటికీ, నియామక అవకాశం దక్కని అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. 24 ఏళ్ల వారి కలలను సీఎం వైఎస్‌ జగన్‌ సాకారం చేశారు. వీరు ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిని మినిమం టైమ్‌ స్కేలుపై టీచర్లుగా నియమించేందుకు పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ గురువారం మెమో జారీ చేశారు.

1998 డీఎస్సీ ఎలిజిబుల్‌ అభ్యర్థుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను స్వీకరించనున్నారు. వీరిని 2008 డీఎస్సీ అభ్యర్థులకు మాదిరిగానే ఎమ్‌.టీ.ఎస్‌ పై టీచర్‌ పోస్టుల్లో అడహాక్‌ పద్ధతిలో నియమిస్తారు. క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్, కేజీబీవీ అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్, మోడల్‌ స్కూళ్లలో గెస్ట్‌ లెక్చరర్లు, డీఈవో పరిధిలోని టీచర్ల పూల్‌లో నియమించనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 98 డీఎస్సీ ఫైల్‌ పై సీఎం జగన్‌ సంతకం చేసి న్యాయం చేకూర్చడం పట్ల అభ్యర్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిర్ణయం వల్ల 4,565 మందికి ఇప్పుడు న్యాయం జరగనుందని ఎమ్మెల్సీ కల్పాలతారెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు