AP: మండలానికి 2 జూనియర్‌ కాలేజీలు

23 Jun, 2022 09:33 IST|Sakshi

ఒకటి కో ఎడ్యుకేషన్‌.. రెండోది ప్రత్యేకంగా బాలికల కోసమే: మంత్రి బొత్స

ప్రభుత్వ ఆధ్వర్యంలో మొత్తం 1,358 కాలేజీలు

అందుబాటులో 474.. ఈ ఏడాదే మిగతా 884 ప్రారంభం

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి మండలంలో రెండు చొప్పున ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలను అందుబాటులోకి తెస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో 679 మండలాలు ఉండగా 1,358 ఇంటర్‌ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం 474 జూనియర్‌ కాలేజీలున్నాయని, మిగతా 884 కళాశాలల్లో కూడా తరగతులు ఈ ఏడాదే కొత్త విద్యాసంవత్సరం నుంచి  ప్రారంభిస్తామని బొత్స వెల్లడించారు. టెన్త్‌ పాసైన విద్యార్ధులు ఇంటర్‌లో చేరేందుకు వీలుగా ఆయా మండలాల్లో రెండేసి హైస్కూళ్లలో ఇంటర్‌ తరగతులు (10 + 2) ప్రారంభిస్తారు. వీటిలో ఒకటి కో ఎడ్యుకేషన్‌ కాలేజీ కాగా రెండోది ప్రత్యేకంగా బాలికల కోసమే నిర్వహించనున్నారు. బుధవారం విజ యవాడలో ఇంటర్‌ ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. 

ప్రైవేట్‌ కాలేజీల కంటే మిన్నగా..
జూనియర్‌ కాలేజీలలో కొన్నిటిని బాలికల కళాశాలలుగా మార్పు చేస్తున్నందున 25 చోట్ల సమస్యలు తలెత్తుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిని పరిశీలించి అవసరమైన మార్పులు చేస్తామని బొత్స వెల్లడించారు. ప్రైవేట్‌ కాలేజీల కంటే మిన్నగా మంచి సదుపాయాలతో పాటు ఉత్తమ బోధన అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌ కాలేజీల్లో చేర్చి అధిక ఫీజుల భారంతో ఒత్తిడికి గురి కాకుండా ప్రభుత్వ కళాశాలల్లోనే చేర్చాలని సూచించారు. విద్యారంగాన్ని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి జగన్‌ విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారని బొత్స పేర్కొన్నారు. మనబడి నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, విద్యాదీవెన తదితర కార్యక్రమాలతో విద్యార్ధులను ప్రోత్సహించడమే కాకుండా ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్, ప్రీ హైస్కూల్, హై స్కూల్, హైస్కూల్‌ ప్లస్‌ లాంటి కొత్త విధానంతో పాఠశాల విద్యను పరిపుష్టం చేసే చర్యలు తీసుకున్నారని చెప్పారు.   ప్రపంచంలో అందరికన్నా మిన్నగా మన విద్యార్ధులు ప్రత్యే క గుర్తింపు సాధించాలనేది సీఎం ఆకాంక్ష అన్నారు.

బైజూస్‌పై బాబు ఆరోపణలు అర్థరహితం
మన విద్యార్ధులను అత్యుత్తమ రీతిలో తీర్చిదిద్దేందుకు సీఎం జగన్‌ తపిస్తుంటే విపక్ష నేత చంద్రబాబు మాత్రం ఓర్వలేనితనంతో అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ విధానం, ఫౌండేషన్‌ నుంచి ప్లస్‌ 2 వరకు విద్యార్ధులకు ఉత్తమ బోధన అందేలా సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని  తెలిపారు. ఇందులో భాగంగా ప్రముఖ విద్యాసంస్థ ‘బైజూస్‌’ ద్వారా ఉత్తమ కంటెంట్‌ అందించేందుకు ఒప్పందం చేసుకుంటే అది జగన్‌ జ్యూస్‌ అని చంద్రబాబు మాట్లాడడం దారుణమన్నారు.

బైజూస్‌ అంటే హెరిటేజ్‌ జ్యూస్‌ కాదన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రత్యేక యాప్‌ ద్వారా బైజూస్‌ కంటెంట్‌ ఉచితంగా అందుతుందన్నారు. 8వ తరగతి విద్యార్ధులకు ల్యాప్‌టాప్‌ల ద్వారా బైజూస్‌ కంటెంట్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.  ఏటా 8వ తరగతిలోకి వచ్చే దాదాపు 4.5 లక్షల మందికి ల్యాప్‌టాప్‌లు అందిస్తామని చెప్పారు.  డిజిటల్‌ తరగతుల కోసం టీవీలు, స్క్రీన్లు ఏ ర్పాటు చేయాలని సీఎం ఆదేశించా రని తెలిపారు.  35 లక్షల మంది పిల్లలకు మేలు చేకూరుతుందన్నారు. బైజూస్‌తో రూ.500 కోట్లతో ఒప్పందం చేసుకున్నామనడం సరికాదన్నారు.విధాన నిర్ణయాల్లో రాజీ లేదు

విద్యార్థులు, ప్రజల మేలు కోసం ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల అమలులో సమస్యలు ఎదురైతే పరిష్కరించుకుని ముందుకు వెళ్తామే కానీ వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. జీవో 117 అమలుపై ఉపాధ్యాయ సంఘాలు, టీచర్‌ ఎమ్మెల్సీలతో చర్చించామని, వారు సూచించిన అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంగ్లీషు మీడియం, ఫౌండేషన్‌ స్కూళ్ల విధానం వద్దంటే కుదరదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు