పిట్ట కొంచెం.. కూత ఘనం 

7 Jun, 2022 23:45 IST|Sakshi
ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌  సాధించిన చిన్నారి లక్షర ఆద్య   

కడప అర్బన్‌: కేవలం రెండు సంవత్సరాల 11 నెలల పసిప్రాయంలోనే చిన్నారి లక్షర ఆద్య సోమలరాజు అరుదైన రికార్డును సాధించింది.  వివరాల్లోకెళితే.. కడప చిన్నచౌక్‌ శ్రీనగర్‌కాలనీలో నివసించే సోమలరాజు జగదీష్‌రాజు, హిమబిందు దంపతుల కుమార్తె లక్షర ఆద్య ఏకసంథాగ్రహి. తల్లిదండ్రులు ఏదైనా ఒక్కసారి చెబితే గుర్తుంచుకుని వెంటనే అప్పచెప్పేది.

చిన్నారి ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు పాపకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఇటీవల పలువురి ద్వారా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ గురించి తెలుసుకుని ప్రతిభను నిర్వాహకులకు వివరించారు. దేశ వ్యాప్తంగా వేలాదిమంది పోటీపడ్డారు. అందులో అతి పిన్నవయసులో విజేతగా నిలిచి వైఎస్సార్‌ జిల్లా కీర్తిని పతాకను ఎగరేసి అందరి దృష్టిని ఆకర్షించింది.  

పాప ఏం చేసిందంటే.. 
8 గ్రహాలు, విష్ణువు అవతారాలు, రాష్ట్రాలు, రాజధానులు, ప్రముఖ వ్యక్తులు, శరీర భాగాలు, కూరగాయలు, పండ్లు, 118 వివిధ రకాల వస్తువుల పేర్లు, క్యాలెండర్‌లో నెలలు, వారంలో రోజులు, 16 జాతీయ చిహ్నాలు, 17 రంగులు, 19 మ్యాథమేటికల్‌ షేప్స్, 22 క్రీడలు, నిర్వాహకులు అడిగిన 26 జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలను అనర్గళంగా చెప్పింది. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నిర్వాహకులను, పోటీపడిన వారిని అబ్బురపరుస్తూ ఘనతను చాటింది.  

చినానరికి జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ అభినందన 
చిన్నారి లక్షర ఆద్య తల్లిదండ్రులు జగదీష్‌ రాజు, హిమబిందు సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ కలిశారు. చిన్నారికి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ అందజేసిన సర్టిఫికెట్, జ్ఞాపికలను చూపారు. జిల్లా ఎస్పీ లక్షర ఆద్య  ప్రతిభను అభినందించి ఆశీర్వదించారు.  

మరిన్ని వార్తలు