ఏపీలో 20 లక్షల కరోనా పరీక్షలు పూర్తి

2 Aug, 2020 03:26 IST|Sakshi

తొలి లక్ష పరీక్షలకు 59 రోజుల సమయం

10 లక్షల నుంచి 20 లక్షల పరీక్షలు 27 రోజుల్లోనే

ఇప్పటివరకు 20 లక్షలు చేసింది.. కేవలం నాలుగు రాష్ట్రాలే

ఈ నాలుగు రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రం ఏపీనే

మిలియన్‌ జనాభా లెక్కన చేస్తున్న పరీక్షల్లో దేశంలో ఇప్పటికీ నంబర్‌వన్‌ రాష్ట్రమే

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ మరో మైలురాయిని అధిగమించింది. శనివారం నాటికి 20 లక్షల టెస్టులు పూర్తి చేసి రికార్డు సృష్టించింది. దేశంలో నాలుగు రాష్ట్రాలు మాత్రమే ఈ ఘనత సాధించగా అందులో జనాభా ప్రాతిపదికన చిన్న రాష్ట్రం.. ఏపీనే కావడం గమనార్హం. మొత్తం 14 వైరాలజీ ల్యాబ్‌లు, 85 ట్రూనాట్‌ ల్యాబొరేటరీలతో ఎక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే. ఇక మిలియన్‌ జనాభా ప్రాతిపదికన ఎక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఏపీలో మిలియన్‌ జనాభాకు 37,689 పరీక్షలు చేస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

15 రోజుల్లోనే 7.52 లక్షల టెస్టులు..
రాష్ట్రంలో ఇది పెద్ద రికార్డుగా చెప్పొచ్చు. జూలై 17 నుంచి జూలై 31 వరకు చేసిన టెస్టుల సంఖ్య 7,52,061 నమోదైంది. ఇదిలా ఉంటే జూలై 27 నుంచి జూలై 31 వరకు రోజూ 60 వేలకు తగ్గకుండా టెస్టులు నిర్వహించారు. అత్యధికంగా జూలై 28న 70,584 టెస్టులు చేశారు.

20 లక్షల క్లబ్‌లో నాలుగు రాష్ట్రాలే..
దేశంలో 20 లక్షలు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన రాష్ట్రాలు కేవలం నాలుగు మాత్రమే. వీటిలో తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి. వీటి గణాంకాలు ఇలా..

రాష్ట్రం             పరీక్షలు        పాజిటివ్‌           మృతుల శాతం
మహారాష్ట్ర        21,33,720      4,22,118                3.55
తమిళనాడు     26,58,138      2,45,859                1.60
ఉత్తరప్రదేశ్‌     23,25,428         85,461                1.91
ఆంధ్రప్రదేశ్‌    20,12,573      1,50,209                0.94

దేశంలో జరిగిన పరీక్షల్లో 10 శాతం పైన ఏపీలోనే
జనాభా ప్రాతిపదికన చూస్తే చాలా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌ చాలా చిన్నది. అయినా దేశంలో ఆగస్టు 1 ఉదయం 9 గంటల వరకు జరిగిన పరీక్షల్లో 10.39 శాతం ఏపీలోనే జరిగాయి. చిన్న రాష్ట్రంలో ఇన్ని లక్షల పరీక్షలు చేయడం ఆశ్చర్యకరమని, ప్రత్యేక వ్యూహంతో ముందుకెళితే తప్ప ఇన్ని సాధ్యం కావని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఇప్పటివరకు 1.93 కోట్ల పరీక్షలు జరగ్గా అందులో ఏపీలోనే 20.12 లక్షల పరీక్షలు చేశారు.

టెస్టింగ్‌.. ట్రేసింగ్‌.. ఐసొలేషన్‌
ఎక్కువ పరీక్షలు చేయడం వల్ల ఎక్కువ పాజిటివ్‌ కేసులు రావచ్చు కానీ ఎక్కువ మందిని కట్టడి చేయొచ్చు. పరీక్షలు చేయడం (టెస్టింగ్‌), పాజిటివ్‌ కేసులను గుర్తించడం (ట్రేసింగ్‌), వారికి చికిత్స లేదా హోం ఐసొలేషన్‌.. ఇలా ఈ మూడు వ్యూహాలను పక్కాగా అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముందుకు వెళుతోంది.

వైద్య సిబ్బందికి పుష్కలంగా మాస్క్‌లు, పీపీఈలు
ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న కోవిడ్‌–19 డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది రక్షణ కోసం పుష్కలంగా ఎన్‌–95 మాస్క్‌లను, పీపీఈలను (వ్యక్తిగత రక్షణ పరికరాలు)రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రానికి 2.5 లక్షల ఎన్‌–95 మాస్క్‌లు వచ్చాయి. అలాగే 14.7 లక్షల పీపీఈలు రాష్ట్రానికి చేరాయి. వివిధ జిల్లాల్లో 6.57 లక్షల ఎన్‌–95 మాస్క్‌లు, 8.47 లక్షలు పీపీఈలు అందుబాటులో ఉన్నాయి. 

కేసులు పెరిగినా టెస్టులు తగ్గించం
రాష్ట్రంలో ఎక్కువ పాజిటివ్‌ కేసులు వస్తున్నాయని భయపడాల్సిన పనిలేదు. ఇందులో 80 శాతం పైగా కేసుల్లో తీవ్రత చాలా తక్కువ. వీరు ఇంట్లోనే చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మందిని గుర్తించడం ద్వారా కరోనా వ్యాప్తిని కట్టడి చేయొచ్చు. కేసులు పెరిగినా టెస్టులు తగ్గించం. వ్యాప్తి నియంత్రణే లక్ష్యం.
–డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖ 

మొత్తం 14 ల్యాబ్‌లు
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 6కి ముందు ఒక్క వైరాలజీ లేబొరేటరీ కూడా లేదు. ఇప్పుడు వాటి సంఖ్య 14కు పెరిగింది. 12 జిల్లాల్లో జిల్లాకొకటి చొప్పున, చిత్తూరు జిల్లాలో 2 కలిపి మొత్తం 14 వైరాలజీ ల్యాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

>
మరిన్ని వార్తలు