నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌  

14 May, 2022 20:42 IST|Sakshi

రాష్ట్రంలో 22.54 లక్షల కుటుంబాలకు మేలు

ప్రభుత్వ వరంతో ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో ఆనందం

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొరివంక గ్రామానికి చెందిన నిరుపేద దళితురాలు బలగ కామాక్షి భర్త చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందగా కుమారుడు బాలరాజు కిడ్నీ వ్యాధితో చనిపోయాడు. కాయకష్టం చేసుకొని మనవరాళ్లకు వివాహం చేసింది. గతంలో విద్యుత్‌ బిల్లులు కట్టలేక నానా అవస్థలు పడేది. ఇప్పుడు 200 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌తో పాటు పింఛన్‌ కూడా అందిస్తుండటంతో తన జీవితంలో వెలుగు రేఖలు ప్రసరిస్తున్నాయని సంతోషంగా చెబుతోంది’’

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మీటేతాండలో ఆర్‌.భీమా నాయక్‌కు చిన్న ఇల్లు ఉంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే ఆయన గతంలో నెలకు రూ.150 నుంచి రూ.250 వరకు కరెంటు బిల్లు కట్టేవారు. ఇప్పుడు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అందచేస్తుండటంతో మూడేళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. కరెంట్‌ బిల్లుల కింద ఇప్పటి వరకు సుమారు రూ.8 వేలకుపైగా మిగలడంతో ఇతర అవసరాలకు ఉపయోగపడిందని చెబుతున్నాడు’’

ఫ్యాన్, రెండు బల్బులకు.. 
ఉచిత విద్యుత్‌తో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్ది మా జీవితాల్లో వెలుగులు నింపారు. ఒక ఫ్యాన్,  రెండు బల్బులు వినియోగానికి ఇబ్బంది లేదు. పొదుపుగా వాడుకుంటూ నెలకు 200 యూనిట్లు వినియోగం దాటకుండా చూసుకుంటున్నాం.    
–దేవదాసు, భీమవరం, నంద్యాల జిల్లా  

పేదల ఇళ్లలో విద్యుత్‌ వెలుగులపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు 2019 ఆగస్టు నుంచి నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. దీనివల్ల దాదాపు 22,54,596 మంది ఎస్సీ, ఎస్టీలకు మేలు చేకూరుతోంది. గత మూడేళ్లుగా నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించుకుంటున్న వారంతా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా విద్యుత్తు వెలుగులు పొందుతున్నారు. ఈ ఏడాది 17,44,562 ఎస్సీ కుటుంబాలకు, 5,10,034 ఎస్టీ కుటుంబాలకు ఉచిత కరెంటును ప్రభుత్వం అందచేసింది.
 
పొదుపుగా వాడుతున్నాం 
ఉచిత విద్యుత్‌ పథకం ఎస్సీ, ఎస్టీలకు గొప్పవరం. గతంలో ప్రతి నెలా రూ.250కిపైగా బిల్లు చెల్లించే వాళ్లం. ఉచిత విద్యుత్‌ పుణ్యమా అని చార్జీలు చెల్లించే అవసరంలేదు. నెలకు 200 యూనిట్లు దాటకుండా కరెంటును పొదుపుగా వాడుకుంటున్నాం.                 
–పి.భీమన్న, కర్నూలు జిల్లా పోలకల్‌ గ్రామం.
  
హామీని నిలబెట్టుకున్నారు... 
కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించేకునే నేను గతంలో కరెంటు బిల్లులు చెల్లించలేక ఇబ్బంది పడ్డా. ఎస్సీ, ఎస్టీలకు  200 యూనిట్ల వరకు  విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   నిలబెట్టుకున్నారు.  
–గిరి, నంద్యాల హరిజనపేట 

మరిన్ని వార్తలు