విస్తృతంగా వసతులు 

27 Mar, 2023 04:45 IST|Sakshi

పారిశ్రామిక పార్కులు, టౌన్‌షిప్స్‌లో  ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. పీపీపీ విధానంలో కనీసం ఐదు పార్కుల అభివృద్ధి లక్ష్యం 

వీటికి అదనంగా రెడీ టు బిల్డ్‌ పార్కులు.. ప్రైవేట్‌ రంగంలో ఎంఎస్‌ఎంఈ, లాజిస్టిక్‌ పార్కుల అభివృద్ధి 

2023–27 పారిశ్రామిక పాలసీలో విధివిధానాలు ప్రకటించిన ప్రభుత్వం  

సాక్షి, అమరావతి: అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తూ పెట్టుబడులను ఆకర్షించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం పారిశ్రామిక పార్కులు, టౌన్‌షిప్స్‌ను అభివృద్ధి చేసేలా నూతన పారిశ్రామిక విధానం 2023–27లో పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది.

ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నిర్మించే పార్కుల్లో అన్ని రకాల మౌలిక వసతులతో పాటు నివాసానికి అనువుగా టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయనున్నారు. నివాసం నుంచి ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్లే విధంగా వాక్‌ టు వర్క్‌ విధానంలో పారిశ్రామిక పార్కులను తీర్చిదిద్దనున్నారు.

రాష్ట్రంలోని మూడు పారిశ్రామిక కారిడార్లలో ఉన్న 10 పారిశ్రామిక పార్కుల్లో కనీసం ఐదు పార్కులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. కేవలం భారీ పారిశ్రామిక పార్కులే కాకుండా పీపీపీ విధానంలో ఎంఎస్‌ఎంఈ, లాజిస్టిక్‌ పార్కులు, కోల్డ్‌ చైన్‌లను అభివృద్ధి చేస్తారు. దీనికి సంబంధించిన విధివిధానాలను పారిశ్రామిక పాలసీలో ప్రభుత్వం ప్రకటించింది. 

ప్రైవేట్‌ పారిశ్రామిక పార్కులు 
ప్రైవేట్‌ రంగంలో పార్కులు అభివృద్ధి చేసేందుకు కనీస ప్రారంభ పెట్టుబడి రూ.200 కోట్లుగా నిర్ణయించారు. ప్రతిపాదిత పారిశ్రామిక పార్కు కనీసం 50 ఎకరాలకుపైగా ఉండాలి. అదే ఏపీఐఐసీ, ప్రభుత్వ భాగస్వామ్యంతో నెలకొల్పోతే కనీస పరిమితిని 100 ఎకరాలుగా నిర్ణయించారు. అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కులో నివాస, వాణిజ్య సముదాయాల పరిమితి 33 శాతం మించి అనుమతించరు.

పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా మొక్కల పెంపకం, వాననీటి సంరక్షణ కోసం 33 శాతం కేటాయించాల్సి ఉంటుంది. పూర్తిగా ప్రైవేట్‌ రంగంలో పార్కును అభివృద్ధి చేస్తే ఇందుకోసం ప్రత్యేకంగా స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేసి భూమిని బదలాయించాలి. ఒకవేళ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటే ఎస్‌పీవీలో పెయిడ్‌ క్యాపిటల్‌గా 2 – 11 శాతం వాటా ప్రభుత్వానికి కేలాయించాల్సి ఉంటుంది.

ఈ పార్కులో 90 శాతం వినియోగంలోకి వచ్చిన తర్వాత  వాటాను ప్రభుత్వం విక్రయిస్తుంది. ఒకవేళ ప్రభుత్వ భూమిలో ప్రైవేట్‌ డెవలపర్‌ పార్కును అభివృద్ధి చేయడానికి వస్తే దీర్ఘకాలిక లీజు విధానంలో భూమిని కేటాయిస్తారు. స్విస్‌ చాలెంజ్‌ విధానంలో ప్రైవేట్‌ డెవలపర్‌ను ఎంపిక చేస్తారు. నిబంధనలకు అనుగుణంగా పార్కును అభివృద్ధి చేయడంలో డెవలపర్‌ విఫలమైతే ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో భారీ పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి పారదర్శకంగా బిడ్డింగ్‌ విధానంలో ఎంపిక చేస్తారు. కేంద్ర ప్రభుత్వ పీపీపీ నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్‌ డెవలపర్స్‌ ఎంపిక జరుగుతుంది. 

ఎంఎస్‌ఎంఈ పార్కులు 
అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈ రంగంలో కూడా ప్రైవేట్‌ పారిశ్రామిక పార్కులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం 25 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు కానున్నాయి. రెడీ టు బిల్డ్‌.. అంటే తక్షణం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించుకునే విధానంలో డిజైన్‌ ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లను కనీనం 50,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే విధంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.

ఇందుకోసం నూతన పారిశ్రామిక విధానంలో ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ పార్కుల మౌలిక వసతుల నిర్మాణ వ్యయంలో 25 శాతం గరిష్టంగా రూ.కోటి వరకు తిరిగి చెల్లిస్తారు. స్టాంప్‌ డ్యూటీ, భూ వినియోగ మారి్పడి చార్జీలు (నాలా) వంద శాతం రీయింబర్స్‌చేస్తారు. రుణాలపై మూడేళ్లపాటు మూడు శాతం వడ్డీ రాయితీ ఇస్తారు. అభివృద్ధి చేసిన పారిశ్రామిక పార్కులో 50 శాతం వినియోగంలోకి రాగానే 50 శాతం ప్రోత్సాహకాలు అందిస్తారు. 100 శాతం వినియోగంలోకి వస్తే మిగిలిన 50 శాతం కూడా చెల్లిస్తారు. 

లాజిస్టిక్‌ పార్కులు 
సరుకు రవాణా వ్యయం తగ్గించే విధంగా లాజిస్టిక్‌ పార్కులు, గోడౌన్లు, శీతల గిడ్డంగుల్లో  ప్రైవేట్‌ రంగ పెట్టుబడులను ఆకర్షించేలా నూతన పారిశ్రామిక విధానంలో పలు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేట్‌ రంగంలో లాజిస్టిక్‌ పార్కులు, ఇన్‌లాండ్‌ కంటైనర్‌ డిపోలను అభివృద్ధి చేయడానికి కనీస పెట్టుబడిని రూ.50 కోట్లుగా నిర్ణయించారు.

గోడౌన్ల నిర్మాణానికి రూ.5 కోట్లు, శీతల గిడ్డంగులకు రూ.3 కోట్లుగా నిర్ణయించారు. లాజిస్టిక్స్‌ వేర్‌హౌసింగ్‌కు పరిశ్రమ హోదా ఇవ్వడంతోపాటు 100 శాతం స్టాంప్‌ డ్యూటీని రీయింబర్స్‌ చేస్తారు. పేటెంట్ల రిజిస్ట్రేషన్స్ వ్యయంలో 75 శాతంతో పాటు పారిశ్రామిక పాలసీ 2020–23లో పేర్కొన్న రాయితీలను వర్తింపచేస్తారు.  

మరిన్ని వార్తలు