టిఫిన్‌ హోటల్‌కు రూ.21 కోట్ల కరెంటు బిల్లు 

9 Sep, 2021 11:04 IST|Sakshi
విద్యుత్‌ బిల్లు

సాంకేతిక లోపమే కారణం

బాధ్యులపై చర్యలు తీసుకున్న విద్యుత్‌ శాఖ అధికారులు

చింతలపూడి/ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట):  పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోని ఒక చిన్న హోటల్‌ యజమానికి విద్యుత్‌ అధికారులు షాకిచ్చారు. పట్టణానికి చెందిన సాయి నాగమణి కొత్త బస్టాండ్‌ సమీపంలో టిఫిన్‌ హోటల్‌ నడుపుతున్నారు. సెప్టెంబర్‌ నెలకు సంబంధించి ఏకంగా రూ.21,48,62,224 విద్యుత్‌ బిల్లు ఆమె చేతిలో పెట్టడంతో నివ్వెరపోయారు. విషయాన్ని విద్యుత్‌ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా బుధవారం అధికారులు రంగంలోకి దిగి బిల్లును సరిచేశారు. సాంకేతిక లోపం కారణంగానే బిల్లు తప్పు వచ్చిందని సరిచేసినట్లు ట్రాన్స్‌కో ఏఈ శంకర్రావు తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వినియోగదారునికి కొత్త బిల్లు అందజేస్తామన్నారు.

నిర్లక్ష్యంపై చర్యలు.. 
విద్యుత్‌ మీటర్‌లకు రీడింగ్‌ సమయంలో అప్పుడప్పుడు మీటర్లలో గానీ, మీటర్‌ రీడింగ్‌ మెషీన్‌లో గానీ సాంకేతిక లోపాల కారణంగా బిల్లులో సమస్యలు వస్తాయని తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ ఎస్‌.జనార్ధనరావు స్పష్టం చేశారు. ఈనెల 7న చింతలపూడి సెక్షన్‌లో గత నెలలో మార్చిన మీటర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల వినియోగదారుని బిల్లులో భారీ మొత్తం నమోదైందన్నారు. ఈ విషయం అక్కడి ఏఈ దృష్టికి రాగా బుధవారం తిరిగి రీడింగ్‌ తీసి బిల్లును సరిదిద్దినట్లు వెల్లడించారు. బిల్లు తీయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మీటర్‌ రీడర్‌ ప్రభాకర్‌ను విధుల నుంచి తొలగించామని, చింతలపూడి ఏఈని సస్పెండ్‌ చేశామని వివరించారు.

ఇవీ చదవండి:
మచ్చా అన్నందుకు డబుల్‌ మర్డర్‌    
అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్ 

మరిన్ని వార్తలు