ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్‌ సీట్లు 

26 Jul, 2021 03:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్‌.. ఇది ఎంతో మంది విద్యార్థుల కల. వారి కలలను నిజం చేసే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) తేదీ కూడా ఇప్పటికే వచ్చేసింది. సెప్టెంబర్‌ 12న దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు సంబంధించిన ‘నీట్‌’ జరగనుంది. గతేడాది కంటే ఈసారి మరింత పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. గతంలో సీట్లు రాని చాలా మంది విద్యార్థులు.. ఈ ఏడాది ఎంబీబీఎస్‌ సీటు కోసం పోటీ పడుతున్నారు. దంత వైద్య సీటు వచ్చినా చేరకుండా.. ఎంబీబీఎస్‌ కోసం వేచిచూస్తున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. గతేడాది దాదాపు 60 వేల మంది రాష్ట్రం నుంచి నీట్‌కు హాజరయ్యారు. ఈసారి ఆ సంఖ్య 70 వేలకు చేరే అవకాశముంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో మొత్తం 4,858 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నట్టు తేలింది. ఇందులో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185, ప్రైవేటులో 2,673 సీట్లున్నాయి. పద్మావతి మహిళా వైద్య కళాశాల(అటానమస్‌)లో 152 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 5,010 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఆంధ్రా వైద్య కళాశాల, గుంటూరు వైద్య కళాశాల, కర్నూలు వైద్య కళాశాల, రంగరాయ(కాకినాడ) కళాశాలల్లో 250 చొప్పున సీట్లున్నాయి. అత్యల్పంగా ఒంగోలు రిమ్స్‌లో 120 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.   

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రతి కాలేజీలో 10 శాతం.. 
ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని మొత్తం 2,185 ఎంబీబీఎస్‌ సీట్లలో.. 324 సీట్లు నేషనల్‌ పూల్‌(ఆల్‌ ఇండియా కోటా) కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ప్రతి వైద్య కళాశాలలో 10 శాతం చొప్పున మరో 335 సీట్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించారు. అటానమస్‌ అయిన పద్మావతి మహిళా వైద్య కళాశాలలోని 152 సీట్ల(ఈడబ్ల్యూఎస్‌తో కలిపి)లో నేషనల్‌ పూల్‌కు 26 కేటాయిస్తారు. మిగిలిన 126 సీట్లు రాష్ట్ర కోటాలోనే భర్తీ చేస్తారు.  

‘ప్రైవేటు’ యాజమాన్య కోటాలో 921 సీట్లు.. 
రాష్ట్రంలోని 18 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 2,673 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కన్వీనర్‌ కోటా కింద 50 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తీసుకునే ఫీజులే.. కన్వీనర్‌ కోటా సీట్లకు కూడా వర్తిస్తాయి. యాజమాన్య కోటా కింద 921 సీట్లు, ప్రవాస భారతీయ(ఎన్నారై) కోటా కింద 427 సీట్లు భర్తీ చేస్తారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో అత్యధిక సీట్లు(250) నెల్లూరులోని నారాయణ మెడికల్‌ కాలేజీలోనే ఉన్నాయి. తమ ఎంబీబీఎస్‌ కలను నెరవేర్చుకునేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది ఇళ్లలోనే ఆన్‌లైన్‌ కోచింగ్‌ తీసుకుంటూ నీట్‌కు సిద్ధమవుతున్నారు.   

మరిన్ని వార్తలు