ఆక్వా రంగానికి 24 గంటలు విద్యుత్‌ 

12 Feb, 2023 11:06 IST|Sakshi

ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పద్మ జనార్ధనరెడ్డి 

కైకలూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆక్వా రంగానికి 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మ జనార్ధనరెడ్డి చెప్పారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని గోపవరం గ్రామంలో 220/33 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు స్థలాన్ని ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం కైకలూరు ట్రావెలర్స్‌ బంగ్లాలో పద్మ జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ సబ్సిడీ పొందని అర్హులైన ఆక్వా రైతులు ఆయా ప్రాంతాల డీఈలకు సమాచారం అందించాలని సూచించారు.

ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీ సంస్థల పునర్‌వ్యవస్థీకరణ పథకం(ఆర్‌డీఎస్‌ఎస్‌) సాంకేతిక బిడ్‌లను పూర్తి చేసి ఆర్థిక అనుమతులకు పంపించామని పేర్కొన్నారు. సాంకేతికతను అందరూ ఆహ్వానించాలని కోరారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు రైతులకు ఎంతో ఉపయోగకరమని, వీటివల్ల జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 220 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉందని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరుగుతుందన్నారు. ఈ ఏడాది నెల్లూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ నుంచి 800 మెగావాట్లు విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని, రానున్న రోజుల్లో కరెంటు కోతలు ఉండబోవని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌), పలువురు అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు