తొట్లు అమర్చి.. దాహార్తి తీర్చి 

30 Apr, 2022 22:54 IST|Sakshi
సాసర్‌పిట్‌లో దాహార్తి తీర్చుకుంటున్న వన్యప్రాణులు, కొండూరు ఫారెస్టు పరిధిలో సాసర్‌పిట్‌లోకి నీటిని నింపుతున్న అటవీ సిబ్బంది  

వేసవిలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు 

శేషాచలం అడవుల్లో జంతువుల కోసం 24  సాసర్‌పిట్‌లు ఏర్పాటు  

రాజంపేట: ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. వేసవిలోప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం  తగిన చర్యలు చేపడుతోంది. అడవిలో నీటి వనరులు ఎండిపోయి దాహంతో అలమటించే మూగజీవాలు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి, అందుకే వాటి దాహార్తి తీ ర్చేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. డివిజన్‌ పరిధిలో శేషాచలం 1.23లక్షల హెక్టార్లలో,పెనుశిల లక్ష్మీనరసింహ అభయారణ్యం 23వేలహెక్టార్లలో విస్తరించి ఉంది.

అరుదైన జంతు జాలానికి నెలవు.. 
శేషాచలం అటవీ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం జీవ వైవిధ్య అటవీ ప్రాంతం(బయోస్పెయిర్‌)గా గుర్తించింది. ఇక్కడ ఎక్కడాలేని విధంగా అనేక రకాలైన వన్యప్రాణులు, జంతువులు ఉన్నాయి. వీటిని సంరక్షించాల్సిన బాధ్యత అటవీశాఖపై ఉంది. ఇందులో భాగంగా చిత్తూరు, తిరుమల, వైఎస్సార్‌ జిల్లా అడవుల్లోని జంతువుల సంరక్షణపై దృష్టి సారించారు. కాగా జిల్లాలో శేషాచలం, పెనుశిల,  లంకమల్ల అభయారణ్యాలు ఉన్నాయి.

అరుదైన జంతువులకు నిలయం శేషాచలం.. 
శేషాచలం విస్తీర్ణం 82,500 ఎకరాలు. 2010లో జీవ వైవిధ్య నెలవుగా గుర్తించారు. దేశంలో ఉన్న బయోస్పెయిర్‌ జాబితాలో శేషాచలం అడవి చేరింది. ఈ అటవీ ప్రాంతం చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాలో విస్తరించింది. శేషాచలం అడవిలో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, వివిధ రకాల పునుగుపిల్లలు, పక్షులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్లు ఉన్నాయి. ఇవి ఆ యా ప్రాంతాల్లోని రోడ్లపైకి నీటి కోసం వస్తున్నాయి. 

8 శేషాచలంలో సహజ వనరులు
శేషాచలంలో సహజ వనరులు ఉన్నాయి. వర్షాకాలంలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ, వేసవిలో అరకొరగా అయినా నీటి వనరులు అందుబాటులో ఉంటాయి.  పెనుశిల అభయారణ్యంలో కూడా సహజవనరులు ఉన్నట్లుగా అటవీ వర్గాలు భావిస్తున్నాయి. పది కుంటలు ఉన్నాయి. ఆరు చెక్‌డ్యాంలున్నాయి. నీటి ఎద్దడి నివారణలో భాగంగా ఇవి దోహదపడతాయి. 

నిరంతర పర్యవేక్షణ  
రాజంపేట, సానిపాయి, చిట్వేలి, రైల్వేకోడూరు రేంజ్‌లు ఉన్నాయి. బేస్‌క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 80 మంది ప్రొటెక్షన్‌ వాచర్లను నియమించారు. ఇక్కడ 25 కెమెరాలు అమర్చారు. వేసవిలో వన్యప్రాణులు దాహార్తికి అల్లాడిపోకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.  

మూగజీవాల తాగునీటికి ప్రత్యేక ఏర్పాట్లు 
అడవిలోని వివిధ ప్రాంతాల్లో  12 మొబైల్‌ సాసర్‌పిట్‌లు ఏర్పాటు చేశారు. చెట్లకు ఉప్పుముద్దలు కట్టారు. దాహార్తి ఉన్న జంతువులు ఉప్పుముద్దలను నాకితే ఉపశమనం కలుగుతుంది. 2వేల నుంచి 3వేల లీటర్ల కెపాసిటీతో నీటి వనరులను వన్యప్రాణులకు అందుబాటులో ఉంచారు.  

ప్రత్యేక రక్షణ చర్యలు 
శేషాచలం అటవీ ప్రాంతంలో జంతువుల సంరక్షణకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో వన్యప్రాణులు నీటి కోసం జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు 12 సాసర్‌పిట్‌లు, 12 మొబైల్‌ సాసర్‌పిట్‌లను ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నాం. జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.  
–నరసింహారావు, ఇన్‌చార్జి డీఎఫ్‌ఓ, రాజంపేట 

మరిన్ని వార్తలు