సలామ్‌ అత్తకు రూ. 25 లక్షల పరిహారం అందజేత

12 Nov, 2020 12:31 IST|Sakshi

సాక్షి, కర్నూలు : నంద్యాలలో ఆటో డ్రైవర్‌ షేక్‌ అబ్దుల్‌ సలామ్‌ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న​ ఘటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియాను బాధిత కుటుంబానికి అందజేశారు. గురువారం సలామ్‌ అత్తగారిని కలిసిన ఎంపీ బ్రహ్మనందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌ కలెక్టర్‌ వీరపాండ్యన్‌, తహశీల్దార్‌ రవికూమార్‌ ఎక్స్‌గ్రేషియాను బాధిత కుటుంబానికి అందజేశారు. కాగా నంద్యాల మూలసాగరం ప్రాంతానికి చెందిన అబ్దుల్‌సలామ్‌ (45) తన భార్య నూర్జహాన్‌ (38), కుమార్తె సల్మా (14), కుమారుడు దాదా ఖలంధర్‌ (10)తో కలిసి ఈ నెల 3న  ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి రూ.70 వేలు పోగొట్టుకున్న కేసులో విచారణ నిమిత్తం పోలీసులు అబ్దుల్‌ సలామ్‌ను స్టేషన్‌కు పిలిచి విచారణ జరిపారు. ఈ పరిస్థితుల్లో తాను బతకడం అనవసరం అనుకున్న సలామ్‌.. కుటుంబంతో కలిసి గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదవండి: ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏ ఒక్కరినీ వదలం

ఆత్మహత్య చేసుకునే ముందు సలామ్, అతని భార్య నూర్జహాన్‌ సెల్ఫీ వీడియో తీసుకుని.. ఆ సెల్‌ఫోన్‌ను ఇంట్లో పెట్టారు. కుటుంబ సభ్యులు ఆ ఫోన్‌ను పరిశీలిస్తున్న క్రమంలో సెల్ఫీ వీడియో బయటపడింది. ‘నేనేం తప్పు చేయలేదు సార్‌. ఆటోలో జరిగిన దొంగతనానికి, నాకు సంబంధం లేదు. అంగట్లో జరిగిన దొంగతనంతో కూడా సంబంధం లేదు. పోలీసుల టార్చర్‌ భరించలేకున్నా సార్‌. నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. మా చావుతోనైనా మనశ్శాంతి కలుగుతుందని భావిస్తున్నా’మంటూ సలాం, నూర్జహాన్‌ కన్నీటి పర్యంతమవుతూ తమ పరిస్థితిని అందులో వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై విచారణకు ఆదేశించారు.  నంద్యాల వన్‌టౌన్‌ సీఐ సోమశేఖర్‌ను సస్పెండ్‌ చేశారు. అదే విధంగా  పోలీసులు విధుల్లో అత్యుత్సాహం ప్రదర్శించి.. పౌరులకు నష్టం కలిగిస్తే సహించేది లేదని హోం మంత్రి సుచరిత హెచ్చరించారు. అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు.  ఇలాంటి ఘటనలను సహించేది లేదని హెచ్చరించారు. చదవండి: సీఐ సోమశేఖర్, హెడ్‌ కానిస్టేబుల్‌ అరెస్ట్‌ 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా