కొప్పర్తి పార్క్: 2.50 లక్షల మందికి ఉపాధి

29 Nov, 2020 12:56 IST|Sakshi

పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యం రూ.25 వేల కోట్లు

పెట్టుబడి రూ.500 కోట్లు దాటే యూనిట్లకు అదనపు రాయితీలు 

వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌గా నామకరణం 

రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్న మెగా పారిశ్రామిక పార్కులో పెట్టుబడి పెట్టే సంస్థలకు ప్రత్యేక రాయితీలను ప్రకటిస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. సుమారు 7 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ మల్టీ ప్రొడక్ట్‌ మెగా ఇండస్ట్రియల్‌ పార్క్‌కు వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌గా నామకరణం చేశారు. అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తున్న ఈ మెగా ఇండస్ట్రియల్‌ పార్కు (ఎంఐపీ) ద్వారా కనీసం రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి.. కనీసం 2.50 లక్షల మందికి ఉపాధి కల్పించగలమని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. ఇందులో 24 గంటల విద్యుత్, నీరు, మురుగు నీటి శుద్ధి, కామన్‌ ఎఫ్లుయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో నెలకొల్పే యూనిట్లకు రాష్ట్ర పారిశ్రామిక పాలసీ 2020–23లో ఇచ్చే రాయితీలకు అదనంగా మరికొన్ని రాయితీలను అందిస్తోంది.  చదవండి:  (అభివృద్ధిలో పైపైకి)

ప్రత్యేక రాయితీలు ఇలా..
►వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో యూనిట్లను ఏర్పాటు చేసే సంస్థలకు పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు తొలుత భూమిని 33 సంవత్సరాలకు లీజు పద్ధతిలో ఏపీఐఐసీ కేటాయిస్తుంది.  
►గరిష్టంగా 99 సంవత్సరాల వరకు లీజు పొడిగించుకోవచ్చు. వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించిన పదేళ్ల తర్వాత భూమిని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తారు. 
►అమ్మకం, లీజు ఒప్పందాలపై చెల్లించే రిజిస్ట్రేషన్‌ ఫీజు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, స్టాంప్‌ డ్యూటీలపై తొలిసారి నూరు శాతం, రెండోసారి నుంచి 50 శాతం తిరిగి చెల్లిస్తారు. 
►24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరాతో పాటు ఐదేళ్లపాటు యూనిట్‌ విద్యుత్‌పై రూపాయి సబ్సిడీ. 
►స్థిర మూలధన పెట్టుబడిలో 20 శాతం సబ్సిడీ లేదా గరిష్టంగా రూ.10 కోట్ల సబ్సిడీ 
►ఐదేళ్లపాటు 5 శాతం వడ్డీ రాయితీ. ఏడాదికి గరిష్టంగా రూ.1.50 కోట్లు. 
►స్థిర మూలధన పెట్టుబడికి సమానంగా 8 ఏళ్లపాటు 100 శాతం ఎస్‌జీఎస్‌టీ తిరిగి చెల్లింపు. 
►ఐదేళ్లపాటు సరుకు రవాణా వ్యయంలో 25 శాతం సబ్సిడీని ఐదేళ్ల పాటు అందిస్తారు. ఏడాదికి గరిష్టంగా రూ.50 లక్షలు ఇస్తారు. 
►కనీసం రూ.500 కోట్ల పెట్టుబడి, 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించే సంస్థలను మెగా ప్రాజెక్టులుగా గుర్తించి వాటి వ్యాపారం, ఉద్యోగ కల్పన ఆధారంగా మరిన్ని అదనపు రాయితీలు అందిస్తారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా