మల్లవల్లి ఫుడ్‌ పార్క్‌ ద్వారా రూ.260 కోట్ల పెట్టుబడులు

24 Mar, 2022 05:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ మౌలిక వసతుల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద అభివృద్ధి చేసిన రెండు మెగా ఫుడ్‌ పార్కుల ద్వారా రూ.260 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడమేగాక, 6,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రూ.112.94 కోట్లతో 57.95 ఎకరాల్లో మెగా ఫుడ్‌ పార్కును అభివృద్ధి చేయగా, దాని పక్కనే ఏపీఐఐసీ 42.55 ఎకరాల్లో మరో ఫుడ్‌ పార్కును అభివృద్ధి చేసింది.

మెగా ఫుడ్‌ పార్కులో రూ.86 కోట్ల తో ఏర్పాటు చేసిన కోర్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌(సీపీసీ)ను ఈ మామిడి పండ్ల సీజన్‌కు అందుబాటులోకి తెస్తామని ఏపీఐఐసీ చైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మామిడి, టమాట, బొప్పాయి, జామ, అరటి పండ్లతో పాటు వివిధ ఆహార ధాన్యాలను ప్రాసెస్‌ చేసి ప్యాకింగ్‌ చేసుకునేలా సీపీసీని తీర్చిదిద్దినట్టు తెలిపారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కుల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఏప్రిల్‌ మొ దటి వారంలో రోడ్‌ షోలు నిర్వహిస్తామని ఏపీఐ ఐసీ వీసీ,ఎండీ జవ్వాది సుబ్రమణ్యం చెప్పారు.   

మరిన్ని వార్తలు