కేంద్ర గెజిట్‌ నోటిఫికేషన్‌పైనే ప్రధాన చర్చ

17 Aug, 2021 07:57 IST|Sakshi

ఈ నెల 27న కృష్ణా బోర్డు సమావేశం 

నీటి పంపిణీ, క్యారీ ఓవర్, మిగులు జలాల వినియోగం తదితర పది అంశాలే అజెండా

ఏపీ, తెలంగాణకు బోర్డు లేఖ

సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గత నెల 15వ తేదీన జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపైనే బోర్డు సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 27న కృష్ణా బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సోమవారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే లేఖ రాశారు. సమావేశంలో కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడం, క్యారీ ఓవర్, వరద జలాల వినియోగం, కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు తదితర పది అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలను పంపిణీ చేస్తూ జూన్‌ 19, 2015న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది.

దీని ప్రకారమే నాటి నుంచి 2020–21 వరకూ రెండు రాష్ట్రాలకు బోర్డు కృష్ణా జలాలను పంపిణీ చేస్తోంది. అయితే ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలని ఇటీవల తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. నాడు కేంద్రం నిర్ణయానికి ఒప్పుకుని ఇప్పుడు ఇలా చేయడాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుపడుతోంది. అంతర్రాష్ట్ర నదీ జలవివాదాల చట్టం–1956లో సెక్షన్‌–6(2) ప్రకారం.. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని పేర్కొంటోంది. ఈ అంశంపై బోర్డు సమావేశంలో చర్చించాలని నిర్ణయించింది.

బోర్డు సంస్థాగత నిర్మాణంపై కసరత్తు
కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గత నెల 15న జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు నిర్వహించిన సమావేశాలకు తెలంగాణ సర్కార్‌ డుమ్మా కొట్టింది. ఏపీ ప్రభుత్వం తన ప్రతినిధులను పంపి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు సహకరిస్తామని పేర్కొంది. తెలంగాణ గైర్హాజరైన నేపథ్యంలో బోర్డు పరిధి, స్వరూపం ఖరారు ప్రక్రియ అసంపూర్తిగా ఉంది. ఈ నేపథ్యంలో గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై బోర్డు సమావేశంలో ప్రధానంగా చర్చించాలని కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌ నిర్ణయించారు. కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 14 నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఈలోగా బోర్డు సంస్థాగత నిర్మాణాన్ని ఖరారు చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు షెడ్యూల్‌–2లోని ప్రాజెక్టులను బోర్డు తన అధీనంలోకి తీసుకుని నిర్వహిస్తుంది.

ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణల్లోని 12 ప్రాజెక్టులు, వాటిలోని 66 విభాగాలను బోర్డు తన అధీనంలోకి తీసుకుని, నిర్వహించడంపై దృష్టి పెట్టింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడే నాటికి ఈ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అవుట్‌సోరి్సంగ్‌ ఉద్యోగుల వివరాలను తక్షణమే అందజేయాలని బోర్డు ఇరు రాష్ట్రాలకు సోమవారం లేఖ రాసింది. ఈ ప్రాజెక్టులను నిర్వహిస్తోన్న సంస్థల వివరాలను అందజేయాలని కోరింది. రెండు రాష్ట్రాలు ఇచ్చే వివరాల ఆధారంగా సంస్థాగత నిర్మాణాన్ని బోర్డు ఖరారు చేయనుంది.  

ఏపీ వాదనకే సీడబ్ల్యూసీ మద్దతు
ఒక నీటి సంవత్సరంలో వాడుకోని కోటా జలాలను ఆ తర్వాత నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలని తెలంగాణ చేస్తున్న వాదనను ఏపీ సర్కార్‌ కొట్టిపారేస్తోంది. వాటిని క్యారీ ఓవర్‌ జలాలుగానే పరిగణించాలని.. వాటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) సైతం ఏపీ వాదననే బలపరిచింది. బోర్డు సమావేశంలో చర్చించి.. ఏకాభిప్రాయంతో క్యారీ ఓవర్‌ జలాలను రెండు రాష్ట్రాలు పంచుకోవాలని సూచించింది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద జలాలు సముద్రంలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు ఎవరు ఎన్ని నీళ్లు మళ్లించుకున్నా.. వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని ఏపీ సర్కార్‌ కోరుతోంది. కానీ.. దీన్ని తెలంగాణ సర్కార్‌ వ్యతిరేకిస్తోంది. ఈ అంశాన్ని కూడా బోర్డు అజెండాలో చేర్చింది. అలాగే కృష్ణా బేసిన్‌కు మళ్లించే గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో అదనంగా వాటా కేటాయింపు అంశం కూడా అజెండాలో ఉంది. నిబంధనలకు విరుద్ధంగా విద్యుదుత్పత్తి చేయడం, బోర్డుకు నిధులు మంజూరు, ఖాళీలను భర్తీ చేయడంపై కూడా సమావేశంలో చర్చించనుంది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు