బీజేపీ పాలనలో స్వేచ్ఛలేదు.. ఉనికి కోసం చంద్రబాబు పాట్లు: సీపీఐ

27 Aug, 2022 08:53 IST|Sakshi

మహారాణిపేట (విశాఖ దక్షిణ):  దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రధాని మోదీని, బీజేపీని ఎదిరించినా, ప్రశ్నించినా వారిపై సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏలను ప్రయోగించి ఇబ్బందిపాల్జేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. విశాఖ సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో శుక్రవారం సీపీఐ 27వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజా మాట్లాడుతూ బీజేపీ పాలనలో దేశంలో వివిధ రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలేదని, అలాగే ఎవరికీ స్వేచ్ఛ లేదన్నారు. నేడు ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చే పరిస్థితి ఎదురైందన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి దేశంలో అన్ని పక్షాలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీలు ఒక్క తాటి మీదకు వస్తే కేంద్రంలో బీజేపీని గద్దె దించవచ్చన్నారు.

ఉనికి కోసం చంద్రబాబు పాట్లు
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ మాట్లాడుతూ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా త్వరలో ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రధాని మోదీకి, బీజేపీకి దగ్గర కావడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఒకప్పుడు రాజకీయాలను శాసించిన చంద్రబాబు నేడు ఉనికి కోసం పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీఎస్‌ఎన్‌ మూర్తి సభకు అధ్యక్షత వహించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అనీరాజా, మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, సినీ నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఇదీ చదవండి: Andhra Pradesh: ప్లాస్టిక్‌ బ్యానర్లు బ్యాన్‌

మరిన్ని వార్తలు